Published : 20 Mar 2022 01:16 IST

ప్రతిభ అదిరిందయా..!

వయసు కేవలం అయిదేళ్లు.. చదువేమో యూకేజీ! నిజానికి ఈ వయసులో పిల్లలు బడికి పోమని మారాం చేస్తూ ఉంటారు. కానీ ఓ చిన్నారి మాత్రం తన ప్రతిభతో దూసుకుపోతోంది. ఇతరులకూ ఆదర్శంగా నిలుస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని సీతారాంపురానికి చెందిన విద్యార్థిని రియా కుందన ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతోంది. రియాకు చిన్నప్పటి నుంచే జ్ఞాపకశక్తి, నేర్చుకోవాలన్న తపన ఎక్కువ. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె తల్లి, ఆ దిశగా తీర్చిదిద్దారు. నిత్యం చిన్నారికి కొత్త కొత్త విషయాలు నేర్పారు. రియా కూడా చక్కగా నేర్చుకుంది. ఇలా ఫిబ్రవరిలో ఆన్‌లైన్‌ పోటీల్లో పాల్గొని ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది.

చకచకా సమాధానాలు...

రియా.. అయిదు సంవత్సరాల నాలుగు నెలల వయసులో 4 నిమిషాల 52 సెకన్ల 48 మిల్లీ సెకన్ల సమయంలో జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించి 131 ప్రశ్నలకు చకచకా సమాధానాలు చెప్పి ప్రతిభ చాటింది. వీటిలో ప్రధానంగా పండ్లు, కూరగాయలు, జంతువుల శాస్త్రీయ నామాలు, పలు ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తల పేర్ల వంటివి ఉన్నాయి. తల్లి కీర్తన ఆంగ్లంలో ప్రశ్నిస్తుండగా ఉత్సాహంగా చిన్నారి ఆంగ్లంలోనే సమాధానం చెప్పింది. టైమర్‌ ఆన్‌చేసి ఈ ప్రక్రియను ఆండ్రాయిడ్‌ ఫోన్లో చిత్రీకరించి పంపామని తండ్రి దినేష్‌ చెప్పారు. వీటిని పరిశీలించిన సంస్థ ప్రతినిధులు ఇటీవల చిన్నారికి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు కల్పించి ధ్రువీకరణ పత్రం, పతకం, పెన్ను బహుమతిగా అందించారట.

రోజుకు రెండు గంటలు

స్కూలుకు వెళ్లి వచ్చాక రియా రోజూ రెండు గంటల చొప్పున నెలరోజుల పాటు తల్లి వద్ద ఈ విషయాలు నేర్చుకుంది. నిత్యం ఆడుతూ. పాడుతూ శాస్త్రీయ నామాలు, శాస్త్రవేత్తల పేర్లు ఇతర అంశాలను వల్లె వేస్తూ వచ్చింది. చిన్నారికి మరింత జ్ఞాపకశక్తి పెరిగేలా పౌష్టికాహారం ఇస్తూ పాఠ్యాంశాలతోపాటు ఇతర విషయాలను కూడా తల్లిదండ్రులు, పెద్దలు రియాకు చెబుతూ వస్తున్నారు. ఆమెకు సంగీతంపై కూడా మక్కువ ఉండటంతో ఏడాది కాలంగా నేర్చుకుంటోందట. మొత్తానికి చిట్టి రియాది గట్టి బుర్రే కదా ఫ్రెండ్స్‌. మరి ఈ చిన్నారి భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా.

- రియాజుద్దీన్‌ పీర్జాదా, న్యూస్‌టుడే, తుని


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని