సైకిల్‌ తొక్కుతూ.. క్యూబ్‌ కలుపుతూ..

హాయ్‌ పిల్లలూ.. మనకు రంగురంగుల రూబిక్‌ క్యూబ్‌ అంటే భలే సరదా కదూ! పోటీలు పెట్టుకొని మరీ గడులను కలుపుతుంటాం. దానికి బోలెడు అవగాహన, మేధస్సు అవసరం కూడానూ. ఓ నేస్తం కూడా క్యూబ్‌ను పరిష్కరించి ...

Updated : 22 Mar 2022 03:10 IST

హాయ్‌ పిల్లలూ.. మనకు రంగురంగుల రూబిక్‌ క్యూబ్‌ అంటే భలే సరదా కదూ! పోటీలు పెట్టుకొని మరీ గడులను కలుపుతుంటాం. దానికి బోలెడు అవగాహన, మేధస్సు అవసరం కూడానూ. ఓ నేస్తం కూడా క్యూబ్‌ను పరిష్కరించి రికార్డు కొట్టేశాడు. ‘ఆ ఏముంది.. ఇప్పటికే బోలెడు మంది సాధించారు కదా!’ అని అనుకోకండి. ఇది అలాంటిలాంటి ఫీట్‌ కాదు ఫ్రెండ్స్‌.. అదేంటో తెలుసుకోవాలంటే చకచకా ఇది చదివేయండి మరి!

యదర్శన్‌ వెంకటేశన్‌ది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరం. ఈ బాలుడు సైకిల్‌ తొక్కుతూ.. కేవలం 14.32 సెకన్లలోనే క్యూబ్‌ను సాల్వ్‌ చేసి ‘గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించాడు. గత నవంబర్‌లో చేసిన ఈ ప్రదర్శనను రికార్డు ప్రతినిధులు స్వయంగా పరిశీలించారట. అన్ని వివరాలూ సరిచూసుకున్నాక ‘స్పీడ్‌ క్యూబింగ్‌’ విభాగంలో అతడి పేరును, ఇటీవలే ‘గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో నమోదు చేశారట. ఈ విషయాన్ని సంస్థే తన అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. దాంతో బాలుడికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

రెండేళ్ల కష్టం మరి..

ఈ ఫీట్‌ను జయదర్శన్‌ ఒక్కరోజులోనే సాధించేయలేదు ఫ్రెండ్స్‌. దాదాపు రెండేళ్ల నుంచి పజిల్‌ సాల్వింగ్‌లో వేగం పెరిగేలా.. ప్రత్యేకంగా సాధన చేస్తున్నాడట. ఒకవైపు సైకిల్‌ తొక్కుకుంటూ.. మరోవైపు తెలివైన ఎత్తుగడలతో రికార్డు సమయంలో రంగు గడులను కలిపేశాడు. అయితే, అత్యంత వేగంగా క్యూబ్‌ సాల్వ్‌ చేసిన రికార్డు మాత్రం చైనాకు చెందిన వ్యక్తి పేరిట ఉంది. అతడు కేవలం 3.47 సెకన్లలోనే కలిపేశాడట. పెద్దవాళ్లకే తలనొప్పిగా అనిపించే ఈ పజిల్‌ను.. జయదర్శన్‌ మాత్రం చకచకా చేసేసి రికార్డూ కొట్టేయడం గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని