Updated : 24 Mar 2022 01:49 IST

బాక్సింగ్‌లో ‘రాణి’స్తోంది!

పేదరికానికి బాక్సింగ్‌ గ్లవ్‌తో పంచ్‌ ఇస్తూ...  పనిలో పనిగా మనకూ స్ఫూర్తిని పంచి ఇస్తూ... ఓ నేస్తం ముందుకు సాగిపోతోంది.. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో సత్తా చాటి, ఇటీవలే అంతర్జాతీయ పోటీలకూ అర్హత సాధించిన ఆ నేస్తం ఎవరంటే... 

బాక్సింగ్‌ చిచ్చరపిడుగు ఎవరో కాదు.. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన కె.రాణి. తన వయస్సు 13 ఏళ్లు. నాన్న సూరిబాబు చెక్కల మిల్లులో కూలీ. అమ్మ వంటపని చేస్తారు. రెక్కాడితే కానీ డొక్కాడని కడు పేదరికం వారిది. సీతారామపురం ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం రాణి తొమ్మిదో తరగతి చదువుతోంది.

బరువు తగ్గాలని..

రాణికి కొన్ని సంవత్సరాల ముందు వరకు అసలు బాక్సింగ్‌ అంటేనే తెలియదు. శిక్షణకు ముందు 80 కేజీల బరువుండేది. వీరి శిక్షకుడు రామకృష్ణ పాఠశాలలో ఆసక్తి ఉన్న విద్యార్థులను బాక్సింగ్‌ నేర్చుకునేందుకు ఎంపిక చేశారు. కనీసం బరువైనా తగ్గొచ్చు కదా అని శిక్షణలో చేరింది. క్రమంగా వ్యాపకంగా మారి ఇప్పుడు బాక్సింగే జీవిత గమనమైంది. బరువు తగ్గాలన్న లక్ష్యం కూడా నెరవేరి ప్రస్తుతం 60 కేజీలకు తగ్గింది. బాక్సింగ్‌ శిక్షణకు, పోటీలకు అవసరమైన పరికరాలు, ఖర్చులు శిక్షకుడే భరిస్తుండటంతో తల్లిదండ్రులపై ఆ భారం లేదు. దీంతో స్వేచ్ఛగా ఆటపై దృష్టి పెట్టింది.

అంతర్జాతీయ స్థాయికి

మూడేళ్లుగా బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న రాణి 2021లో ‘యూత్‌గేమ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి 60- 65 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. 2021 నవంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకంతోపాటు, ఉత్తమ బాక్సర్‌ అవార్డునూ సొంతం చేసుకుంది. గోవాలో జరిగిన జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. అక్కడా స్వర్ణంతో మెరిసింది. వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న అండర్‌- 14 (60- 65 కేజీల విభాగంలో) అంతర్జాతీయ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. 2022 మార్చి 19న రాజోలులో జరిగిన సీఎం కప్‌ జిల్లాస్థాయి పోటీల్లో పసిడి పతకంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఇటీవల జరిగిన శాప్‌ లీగ్‌లో జిల్లాస్థాయిలో స్వర్ణం సొంతం చేసుకుంది. ఇలా ఎన్నో పతకాలు తన ఖాతాలో వేసుకుంది. ‘బాక్సింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో దేశం పేరు నిలబెట్టేందుకు సాధన చేస్తున్నాను. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నదే నా ఆశయం’ అని రాణి చెబుతోంది. మనమూ ఈ నేస్తానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా మరి!

- ఉప్పాల రాజాపృథ్వీ, ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు