ఓ మర మేకా.. మాలోకి రా!

హాయ్‌ నేస్తాలూ.. ఇప్పటివరకూ మీరు రకరకాల పనులు చేసే రోబోలను చూసుంటారు. కానీ, అవన్నీ మనుషుల మాదిరే ఉంటాయి. ఇప్పుడు మీరు చదవబోయేది మాత్రం అందుకు భిన్నం.

Published : 25 Mar 2022 00:23 IST

హాయ్‌ నేస్తాలూ.. ఇప్పటివరకూ మీరు రకరకాల పనులు చేసే రోబోలను చూసుంటారు. కానీ, అవన్నీ మనుషుల మాదిరే ఉంటాయి. ఇప్పుడు మీరు చదవబోయేది మాత్రం అందుకు భిన్నం. అదేంటంటే - ‘రైడబుల్‌ రోబో గోట్‌’.  ఇంక ఆలస్యం చేయకుండా దాని వివరాలు ఏంటో తెలుసుకుందామా మరి!

జపాన్‌ దేశ రాజధాని టోక్యో నగరంలో ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద రోబో షోను నిర్వహించారు. ఇందులో వివిధ కంపెనీలు తమ సరికొత్త రోబో ఆవిష్కరణలను ప్రదర్శనకు ఉంచుతాయన్నమాట. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ షోలో ప్రముఖ సంస్థ ‘కవాసకి’ విడుదల చేసిన ‘రైడబుల్‌ రోబో గోట్‌’ అందరినీ ఆకర్షించిందట.

ప్రత్యేకత ఏంటంటే..
ఈ రోబో మేక అచ్చుగుద్దినట్లు సాధారణ జంతువులాగే పనిచేస్తుందట. దాదాపు 220 పౌండ్ల బరువును మోయగల సామర్థ్యం దీని సొంతమట. మనుషులనూ ఒకచోటి నుంచి మరోచోటికి తీసుకెళ్లగలదు. కూర్చోగలదు కూడా. ఈ మేకకు తయారీ సంస్థ ‘బెక్స్‌’ అని పేరూ పెట్టిందండోయ్‌. ఆ పేరు వెనక కథేంటంటే.. ఆఫ్రికా దేశాల్లోని అడవుల్లో ఐబెక్స్‌ జాతికి చెందిన మేకలు ఉంటాయట. అవి అధిక బరువులు మోయడంతోపాటు పర్వతాలనూ కొండలనూ అలవోకగా ఎక్కేయగలవు.. ప్రమాదకరమైన లోయల్లోనూ అద్భుతంగా ప్రయాణించగలవు. ఈ జాతి స్ఫూర్తిగా డిజైన్‌ చేసిన రోబో మేకకు కూడా తయారీ సంస్థ దాని పేరు కలిసొచ్చేలా చూసిందన్నమాట.

మార్పులూ చేర్పులయ్యాక ఉత్పత్తి..
ఈ రోబో మేక మోకాళ్లకు అమర్చిన చక్రాల సాయంతో పరుగులూ తీస్తుందట. ఎంత వేగంతో అనేది మాత్రం తయారీ సంస్థ ఇంకా వెల్లడించలేదు. గరుకు, పర్వత ప్రాంతాల్లో మాత్రం కేవలం నడవగలదట. ఇది కేవలం నమూనానే కాబట్టి లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకొని ఉత్పత్తి ప్రారంభిస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అంటే.. రాబోయే రోజుల్లో జంతువుల రూపంలో ఉండే రోబోలనూ మనం చూడొచ్చన్నమాట. భలే భలే..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని