చిన్నారులకు ‘చిట్టి’ పాఠాలు!

హాయ్‌ పిల్లలూ.. మీరంతా రోబో సినిమా చూసే ఉంటారు కదూ! అందులో.. ‘చిట్టి’ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అలాంటి రోబోనే ఇప్పుడు బడిలో విద్యార్థులకు పాఠాలూ చెబుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల కోసమే దీన్ని ప్రవేశపెట్టారట. అలాగనీ..

Published : 26 Mar 2022 00:21 IST

హాయ్‌ పిల్లలూ.. మీరంతా రోబో సినిమా చూసే ఉంటారు కదూ! అందులో.. ‘చిట్టి’ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అలాంటి రోబోనే ఇప్పుడు బడిలో విద్యార్థులకు పాఠాలూ చెబుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల కోసమే దీన్ని ప్రవేశపెట్టారట. అలాగనీ.. ఏ ఇంటర్నేషనల్‌ స్కూల్లోనో అని అనుకోకండి. సర్కారీ బడిలోనే ఫ్రెండ్స్‌.. చకచకా ఈ కథనం చదివి.. గబగబా ఆ వివరాలు తెలుసుకోండి మరి..

ర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలోని మల్లేశ్వరం ప్రాంతంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. రెండు రోజుల కిందట.. ఎప్పటిమాదిరే విద్యార్థులంతా ఉదయం బడికి వచ్చి తరగతి గదుల్లో కూర్చున్నారు. కాసేపటి తరవాత.. అక్కడి ఉపాధ్యాయులు, ఆ రాష్ట్ర మంత్రితో కలిసి బడిలోకి వచ్చారు. అంతే.. పిల్లలంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ‘అందులో వింత ఏముంది?’ అని సందేహం వచ్చింది కదూ! వారితో పాటు ఓ రోబోను కూడా తీసుకొస్తున్నారు మరి!

రెండు భాషల్లో..

విద్యార్థులను ఆకట్టుకోవడంతో పాటు సాంకేతిక విజ్ఞానం అందించేందుకూ కర్ణాటక ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. అందులో భాగంగానే మల్లేశ్వరం పాఠశాలలో ప్రయోగాత్మకంగా రోబోతో పాఠాలు చెప్పించడం ప్రారంభించారు. అంతేకాదు.. విద్యార్థుల సందేహాలనూ అది టక్కున తీర్చేస్తుండటంతో టీచర్లే ఆశ్చర్యపోతున్నారు. ఆంగ్లంతో పాటు కన్నడంలోనూ ఈ రోబో స్పష్టంగా పాఠాలు చెబుతోందట. ఈ మరయంత్రానికి ‘ఈగల్‌ రోబో’ అనే పేరు కూడా పెట్టారండోయ్‌.

త్వరలోనే మరిన్ని బడుల్లో..

తొలిసారిగా చేపట్టిన ‘రోబోతో పాఠాలు’ ప్రయోగాన్ని త్వరలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద కూడా ప్రదర్శించనున్నారట. ఆయన ఆమోదం లభించగానే.. ఇతర ప్రభుత్వ పాఠశాలల్లోనూ రోబో టీచర్లను ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేటుకు దీటుగా సర్కారు బడులనూ డిజిటల్‌ బాట పట్టిస్తుండటంతో, విద్యార్థులూ ఎంతో ఉత్సాహంగా తరగతులకు హాజరవుతున్నారట. ‘మన దగ్గర కూడా ఇలాంటి రోబోలు ఉంటే భలే బాగుండు’ అని అనుకుంటున్నారు కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని