ఆరోగ్యమే మహాభాగ్యం!

హాయ్‌ పిల్లలూ.. హెడ్డింగ్‌ చూడగానే ‘ఇదేంటి.. పాత విషయమే కదా!’ అని అనుకుంటున్నారా?..

Published : 31 Mar 2022 01:44 IST

హాయ్‌ పిల్లలూ.. హెడ్డింగ్‌ చూడగానే ‘ఇదేంటి.. పాత విషయమే కదా!’ అని అనుకుంటున్నారా?

అవును.. కానీ విషయం పాతదే. అయినా దాన్ని పట్టించుకోకపోవడంతో మనలాంటి పిల్లలు చాలామంది చిన్నతనంలోనే అధిక బరువు, పోషకాహార లోపం తదితర సమస్యలతో అవస్థలు పడుతున్నారట.

అందుకే, ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటూ అవగాహన కల్పిస్తున్నాడో నేస్తం. ఆ వివరాలు ఇవిగో..!

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన అగస్త్య ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పిల్లలు.. వారి వయసుకంటే అధిక బరువుతో ఉన్నారనీ, అటువంటి వారు భవిష్యత్తులో గుండెజబ్బు బారినపడే ప్రమాదముందనీ అతడికి తెలిసింది. దాంతో ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, తగిన నిద్ర తదితర అంశాలపై పాఠశాలల్లో అవగాహన కల్పించాలని అనుకున్నాడు. వెంటనే, ‘హెల్తీ యూత్‌’ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. తన సేవలను మరింత విస్తృతం చేసేందుకు ‘వన్‌ మిలియన్‌ ఫర్‌ వన్‌ బిలియన్‌’ అనే ప్రాజెక్టులోనూ భాగస్వామిగా చేరాడు.

ఆన్‌లైన్‌లోనూ..

తన వయసు వారితోపాటు పెద్దవారిలోనూ ఆరోగ్యంపైన అవగాహన పెంపొందించేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నాడు అగస్త్య. అలా ఇప్పటివరకూ 700 మందికి హెల్త్‌ కిట్లను పంపిణీ చేశాడు. సొంత డబ్బుతో పాటు దాతల సహకారంతో బెంగళూరు సమీపంలోని ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పోషకాహారాన్నీ అందించాడు. తన ప్రాజెక్టుకు సోషల్‌ మీడియాను సైతం వినియోగించుకుంటూ వేలాది మందిని ప్రభావితం చేశాడీ బాలుడు.

ప్రత్యేక టాస్కులతో..

చిరుతిళ్లు తింటే ఆరోగ్యానికి హానికరమని చెబుతూనే.. ఆచరణలోనూ మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అగస్త్య. ఇటీవల ‘ఇంట్లోనే వంట’ పేరిట ఓ ఛాలెంజ్‌ విసిరి.. తన సోషల్‌ మీడియా ఫాలోవర్లు ఆ రోజు మొత్తం, ఇంట్లో వండిన ఆహారమే తీసుకునేలా ప్రోత్సహించాడు. గణితం అంటే ఎంతో ఇష్టపడే ఈ నేస్తం ప్రతిరోజూ అయిదు కిలోమీటర్లు సైక్లింగ్‌ చేస్తాడట. అంతేకాదు ఫ్రెండ్స్‌.. వారాంతాల్లో ఈత కూడా కొడుతుంటాడట. బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌ ఆడటంతోపాటు తనకు సంగీతం కూడా వచ్చని చెబుతున్నాడు. ఇంకో విషయమేంటంటే - త్వరలో అమెరికాలోని న్యూయార్క్‌లో జరగబోయే ‘వన్‌ మిలియన్‌ ఫర్‌ వన్‌ బిలియన్‌’ సమ్మిట్‌లో పాల్గొనే అవకాశమూ అగస్త్యకి దక్కింది. ఈ నేస్తానికి ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెబుతూ.. మనమూ ఆరోగ్యంగా జీవిద్దాం మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని