Published : 01 Apr 2022 01:33 IST

పిట్ట కొంచెం.. పాట ఘనం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. స్కూల్‌ ఫంక్షన్లలోనో ఇంట్లోనో అప్పటికప్పుడు మనకు వచ్చిన పాటను సరదాగా పాడేస్తాం కదా! ఓ నేస్తం కూడా అలాగే పాటలు పాడి ఏకంగా రికార్డే సాధించేసింది. ఇంతకీ తనెవరో, ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి!

అమెరికాకు చెందిన విక్టరీ బ్రింకర్‌కు ప్రస్తుతం పదేళ్లు. పాటలు బాగా పాడుతుంది. అలాగని సాధారణ సింగర్‌ అనుకోకండి.. తను ఒపెరా సింగర్‌. అంటే, పాడుతూనే అందుకు తగిన అభినయమూ చేయగలదు. ఏడేళ్ల వయసులో  ఎనిమిదిసార్లు ప్రదర్శన ఇచ్చినందుకు గాను బాలికల విభాగంలో ‘యంగెస్ట్‌ ఒపెరా సింగర్‌’గా ఇటీవల గిన్నిస్‌ రికార్డు సాధించింది.

రెండేళ్ల నుంచే సాధన

విక్టరీకి రెండేళ్ల వయసు నుంచే పాడటం అలవాటు అయిందట. మరుసటి ఏడాదిలో ఇంట్లో ఉన్న సీడీలన్నీ వింటూ.. లిరిక్స్‌ గుర్తుంచుకోవడం ప్రారంభించింది. అలా క్రమక్రమంగా తనకు పాడటం ఇష్టంగా మారింది. తల్లి కూడా ప్రోత్సహించడంతో చిన్నవయసులోనే రికార్డు కొట్టేసింది. ప్రత్యేకంగా శిక్షకుడిని నియమించుకొని మరీ ప్రతి రోజూ గంటపాటు సాధన చేసేదట. ఒకటీ రెండూ కాదు ఏకంగా ఏడు భాషల్లో గలగలా పాడేయగలదట ఈ చిన్నారి. అన్ని భాషల్లోని పదాలూ, రాగాలూ గుర్తుంచుకోవడమంటే మామూలు విషయం కాదు కదా!

రియాలిటీ షోలో..

ఫేమస్‌ మ్యూజిక్‌ రియాలిటీ షో ‘అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌’ సిరీస్‌ 16లోనూ ఈ బాలిక అదరగొట్టింది. నలుగురు జడ్జిలనూ మెప్పించి.. గోల్డెన్‌ బజర్‌ గెలుచుకున్న ఏకైక కంటెస్టెంట్‌గానూ నిలిచింది. అంతేకాదు.. ప్రఖ్యాత క్రీడా పోటీలు, అధికారిక కార్యక్రమాల్లోనూ ఆ దేశ జాతీయ గీతాన్ని ఈ నేస్తమే పాడుతుందట.

తోబుట్టువుల సహకారం

విక్టరీకీ మొత్తం పదిమంది తోబుట్టువులున్నారు. తన గిన్నిస్‌ రికార్డు ప్రయాణంలో వారూ ఎంతో సహకరించారట. వారంతా కలిసి మంచం మీద టెడ్డీబేర్లూ, ఇతర బొమ్మలూ పేర్చి ఉంచితే.. వాటినే ప్రేక్షకులుగా, ఆ గదినే థియేటర్‌లా ఊహించుకొని మరీ విక్టరీ సింగింగ్‌ ప్రాక్టీస్‌ చేసేదట. ఉదయం లేచిన దగ్గర్నుంచీ.. నిద్రపోయేవరకూ పాటలే తన ప్రపంచమట. కొన్నిసార్లు నిద్రలోనూ పాటలు పాడేదని తోబుట్టువులు చెబుతున్నారు.

ఇతర అంశాల్లోనూ..

పాటలు పాడటమే కాకుండా పియానో, నటన కూడా నేర్చుకుంటోంది విక్టరీ. ఖాళీ సమయాల్లో ఈత కొట్టడం, గార్డెనింగ్‌, ఆటలాడటం చేస్తుంటుంది. తన విజయం మరికొంత మంది పిల్లలకు స్ఫూర్తి కలిగించాలని కోరుకుంటోందీ నేస్తం. ‘తల్లిదండ్రులు పిల్లలపైన నమ్మకం ఉంచాలి. అప్పుడే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అలాంటివారే ప్రపంచాన్ని జయించగలరు’ అని విక్టరీ వాళ్ల అమ్మ చెబుతోంది. ‘పాప పేరులోనే విక్టరీ ఉంది’ అనీ, ‘ఈ వయసులోనే గిన్నిస్‌ రికార్డు సాధించడం నిజంగా గ్రేట్‌’ అనీ బోలెడు మంది ఈ నేస్తాన్ని అభినందిస్తున్నారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు