Published : 02 Apr 2022 01:49 IST

చదువుకునేందుకు సాహసం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బడికి వెళ్లనని మారాం చేస్తే.. అమ్మానాన్నలు బతిమిలాడో భయపెట్టో పంపిస్తుంటారు కదా! అన్ని వసతులున్నా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లిపోదామా అని ఆలోచిస్తుంటారు కొందరు. కానీ, ఓ నేస్తం మాత్రం చదువుపైన బోలెడు ఇష్టంతో పెద్ద సాహసమే చేసింది. ఆ వివరాలేంటో చదివేయండి మరి..!

కేరళలోని నెడుంకందం పోలీస్‌ స్టేషన్‌లో 14 ఏళ్ల తమ కూతురు తప్పిపోయిందని తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆ అమ్మాయి ఆచూకీని కనిపెట్టారు. తర్వాత ‘ఎందుకు వెళ్లిపోయావు?’ అని ప్రశ్నించడంతో.. ఆమె ఇచ్చిన జవాబుకు వారు ఆశ్చర్యపోయారట. ఇంతకీ ఆ నేస్తం ఏం చెప్పిందంటే - చదువుకునేందుకు వెళ్లానని.

సెలవుల్లో తీసుకెళ్లి..

ఆ నేస్తం పేరు బెరాయి. చేపలు పట్టుకొని జీవించే కటుంబం వీళ్లది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వీరి గ్రామం సముద్రానికి ఆనుకొని ఉండటంతో ఏడాదంతా పని దొరకదు. దాంతో ఉపాధి లేని సమయాల్లో ఇక్కడి వారు వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు. బెరాయి తల్లిదండ్రులు కూడా ఇటీవల కేరళకు వలస వెళ్లారు. నెడుంకందం సమీపంలోని యాలకుల తోటల్లో కూలీలుగా పనికి కుదిరారు. పాఠశాలకు సెలవులు కావడంతో కూతురిని కూడా వారితోపాటే తీసుకెళ్లారు. సెలవులు పూర్తయ్యాక ‘నేను తరగతులకు హాజరవ్వాలి. ఊరికి వెళ్తా’నని తల్లిదండ్రులను అడిగింది బెరాయి. కానీ, వాళ్లు ఒప్పుకోకపోవడంతో చాలా బాధపడింది.

రైల్వే స్టేషన్‌ నుంచి ఫోన్‌..

చదువుపైన ఇష్టంతో ఎలాగైనా పాఠశాలకు వెళ్లాలనుకొంది బెరాయి. తమ పక్క వీధిలో ఉండే బెంగాల్‌కు చెందిన ఓ కుటుంబం అక్కడికి వెళ్తుందని తెలుసుకున్న బాలిక.. తానూ వారితోపాటే బయలుదేరాలని అనుకుంది. అడిగితే ఇంట్లో వాళ్లు పంపించరని.. ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. తమ కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. నెడుంకందం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజులకు దాదాపు 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి.. బెంగాల్‌ రైల్వేస్టేషన్‌లో దిగిన తర్వాత ఇంటికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చింది బెరాయి.

చదువు కొనసాగించేలా..

తల్లిదండ్రుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ బాలికకు కౌన్సెలింగ్‌ ఇచ్చి, జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. చదువు కోసం బెరాయి చేసిన సాహసాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోయారు జడ్జి. దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు.. కేరళ బడుల్లో చదువు కొనసాగించేలా, అక్కడి భాషల్లో బోధనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారాయన. దాంతో బెరాయి కూడా ఎంచక్కా తల్లిదండ్రులతోనే ఉంటూ చదువుకునే అవకాశం ఏర్పడింది. అంతేకాదు.. తనలాంటి అనేకమంది విద్యను కొనసాగించేలా చేసిందన్నమాట. అందుకే, అన్ని సౌకర్యాలూ ఉన్న మనం, బడిని నిర్లక్ష్యం చేయకుండా బాగా చదువుకుందాం మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు