Updated : 03 Apr 2022 05:29 IST

స్కేటింగ్‌లో చిరుత!

‘ఓర్పుగా ఉంటే ఓటమి విలువైన పాఠాలు నేర్పుతుంది. విజయం సాధించే నేర్పును చెబుతుంది. ప్రయత్నాన్ని నమ్ముకుంటే... కచ్చితంగా ఏదో ఒక రోజు విజయం వరిస్తుంది’ ఈ వాక్యాలన్నీ స్కేటింగ్‌లో చిరుతలా దూసుకుపోతున్న ఓ నేస్తానికి అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటుతూ ఆ చిన్నారి విజయ పథాన సాగుతోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి స్కేటింగ్‌ పోటీల్లో పసిడి కైవసం చేసుకుని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఇంతకీ ఆ చిరుత.. ఎవరు..? తాను సాధించిన విజయాలేంటో తెలుసుకుందామా..!

ఆ స్కేటింగ్‌ చిచ్చరపిడుగు ఎవరో కాదు.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన హనీఫామెహనాజ్‌. తన వయసు 12ఏళ్లు. స్థానిక ప్రైవేటు స్కూల్‌లో ఏడో తరగతి చదువుతోంది. తండ్రి మెహబూబ్‌ అలీ, తల్లి మానస. హనీఫాకు ఏడేళ్ల ప్రాయం నుంచే స్కేటింగ్‌ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పింది. వారు కూడా ప్రోత్సహించి శిక్షణ, మంచి ఆహారం, క్రీడా పరికరాలు ఇలా అన్నీ సమకూర్చారు. దీంతో స్వేచ్ఛగా సాధన చేయటం మొదలు పెట్టింది.

ఆరేళ్ల ఎదురుచూపులు

హనీఫా క్రీడా ప్రస్థానం ప్రారంభం నుంచే విజయాలతో సాగలేదు. అపజయాల నుంచి నేర్చుకున్న పాఠాలు, మెలకువలతో ఒక్కో మెట్టు ఎక్కి ప్రస్తుతం విజయ పథాన దూసుకుపోతోంది. రోలర్‌ స్కేటింగ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు హనీఫా 2017 నుంచి అర్హత సాధిస్తూనే ఉంది. కానీ పసిడి పతకం సాధించేందుకు ఆరేళ్లు పట్టింది. మొదటి ఏడాది కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2018, 2019, 2020 మూడేళ్లలో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగినా రజత పతకాలే దక్కాయి. ఓటమి నేర్పిన పాఠాలు, అనుభవాలతో 2022 జనవరిలో రావులపాలెంలో జిల్లాస్థాయి, విశాఖపట్నంలో రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీల్లో పసిడి పతకాలు సాధించింది. దిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. 2022 మార్చి 25న స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీల్లో స్వర్ణం సాధించింది.

చదువుల్లోనూ...

హనీఫా చదువు, స్కేటింగ్‌ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అందుకే తను క్లాసులో ఎప్పుడూ మార్కుల్లో మొదటి మూడు స్థానాల్లోనే ఉంటుంది. ‘వ్యాయామం, సాధన వల్ల శారీరకంగా, మానసికంగానూ దృఢంగా ఉంటాను. స్కేటింగ్‌లో ఎప్పటికైనా అంతర్జాతీయ స్థాయికి చేరుకుని దేశం పేరు నిలబెట్టాలన్న ఆశయంతోనే సాధన చేస్తున్నాను’ అని హనీఫా తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం మరి.. మన నేస్తానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా.

- ఉప్పాల రాజాపృథ్వీ, ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని