Updated : 06 Apr 2022 04:11 IST

నడిపించే కాళ్లనే.. కనిపించే కళ్లు చేశాడు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అని పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు కదూ! శరీరంలోని అన్ని అవయవాలూ సరిగ్గా పనిచేస్తున్న వారే.. ఏదో ఒకటి తగిలి అప్పుడప్పుడూ కిందపడుతుంటారు. వాళ్లే అలా అయితే.. ‘మరి కళ్లు లేనివారి పరిస్థితి ఏంటి?’, ‘చూపు లేనివారు ఒంటరిగా ఎక్కడికైనా ఎలా వెళ్లగలరు?’ - ఈ ప్రశ్నలకు సమాధానంగా సరికొత్త ఆవిష్కరణ చేశాడో నేస్తం. ఆ వివరాలే ఇవీ..

సోం రాష్ట్రానికి చెందిన అంకురిత్‌ కర్మాకర్‌ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ వయసులోనే అంధులకు ఉపయోగకరంగా ఉండేలా  ప్రత్యేక బూట్లను తయారు చేశాడు. సెన్సార్‌ సాయంతో పనిచేసే ఈ స్మార్ట్‌ బూట్లు నడిచే సమయంలో చూపు లేని వారికి మార్గనిర్దేశం చేస్తాయన్నమాట.

అడ్డొస్తే.. శబ్దం చేస్తుంది
అంకురిత్‌ రూపొందించిన ఈ బూట్లను ధరించిన వ్యక్తి నడుస్తున్న దారిలో ఏదైనా అడ్డుగా ఉంటే, అందులోని సెన్సార్‌ గుర్తిస్తుంది. అది వెంటనే బీప్‌లాంటి శబ్దం చేస్తుంది. దాని ద్వారా ఆ వ్యక్తి.. దారిలో ఏదో ఉందని అప్రమత్తం అవుతారన్నమాట. తర్వాత అందుకు తగినట్లు కాస్త పక్కకు జరిగి వెళ్లడమో లేదా దారి మార్చుకోవడమో చేయవచ్చు. 

శాస్త్రవేత్త కావాలనీ..

సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా, వారి సమస్యలకు పరిష్కారాలను కనిపెట్టి.. వాళ్ల జీవనం సాఫీగా సాగేలా చూస్తానంటున్నాడు అంకురిత్‌. భవిష్యత్తులో పెద్ద శాస్త్రవేత్త కావాలనేది అతని లక్ష్యమట. తన తల్లి ప్రోత్సాహంతోనే ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తున్నానని చెబుతున్నాడీ నేస్తం. ఈ సరికొత్త షూస్‌ విషయం సోషల్‌ మీడియాలో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. కొందరు నెటిజన్లు ‘తొమ్మిదేళ్లకే అద్భుతం చేశావు’ అంటూ, మరికొందరు ఆ ఆవిష్కరణకు మెరుగులు దిద్దే ఆలోచనలు చెబుతూ.. ఇంకొందరేమో ‘త్వరగా పేటెంట్‌ తీసుకోమనీ’.. ఇలా రకరకాలుగా బాలుడిని అభినందిస్తున్నారు. చూపు లేని వారి కోసం ఇంత బాగా ఆలోచించిన ఈ బాల మేధావి.. భవిష్యత్తులో మరింత పేరు తెచ్చుకోవాలని మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని