Updated : 07 Apr 2022 00:14 IST

హుఁ.. హా.. బుజ్జి బ్రూస్‌లీ!

‘తపన ఉంటే చాలు.. పేదరికం వెక్కిరించినా... ఫలితాలు దానంతట అవే వస్తాయి’ అని నిరూపిస్తున్నాడు ఓ బుడత. తన చిట్టి చిట్టి చేతులతో... లేత కాళ్లతోనే కదం తొక్కుతూ కరాటేలో పతకాల పంట పండిస్తున్నాడు. మెడల్స్‌తో మెడ మొత్తం నిండిపోయేలా దూసుకుపోతున్నాడు! బక్కపలుచని దేహంతోనే బుజ్జి బ్రూస్‌లీలా ముందుకు సాగుతున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. శిక్షకుల ప్రోద్బలం తోడవ్వటంతో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాడు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు గెలిచి శభాష్‌ అనిపించుకుంటున్నాడు. తాజాగా ఆసియా దేశాల అంతర్జాతీయ కరాటే పోటీల్లోనూ సత్తాచాటి పసిడి కైవసం చేసుకున్నాడు. మరి ఆ కరాటే కిడ్‌ ఎవరో తెలుసుకుందామా!

ఆ చిన్నారి కరాటే వీరుడు ఎవరో కాదు.. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన మణికంఠ వెంకట నాగ సతీష్‌. వయసు 10 ఏళ్లు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. తండ్రి శ్రీనివాస్‌ రోజువారీ కూలి. తల్లి సుబ్బలక్ష్మి గృహిణి. మణికంఠ తనకు కరాటే ఇష్టం అని చెప్పగానే  తల్లిదండ్రులు 2016లో శిక్షణలో చేర్పించారు. శిక్షకుడు సైతం వీరి కుటుంబ పరిస్థితి, చిన్నారి ఉత్సాహాన్ని చూసి ఉచితంగా శిక్షణ ఇచ్చారు.

పతకాల వేటలో విజయ కేతనం
మణికంఠ 2018 నుంచి పోటీలకు వెళ్లటం మొదలుపెట్టాడు. 2019లో రాజమహేంద్రవరంలో జరిగిన జిల్లా స్థాయి, గాజువాకలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకాలు కైవసం చేసుకున్నాడు. విశాఖలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలకు అర్హత సాధించి, అక్కడ కూడా పసిడి పంట పండించాడు. 2020లో జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచాడు. 2021తో గాజువాకలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో విజేతగా నిలిచాడు. దీంతో 2022 ఫిబ్రవరిలో ఓ కరాటే అసోసియేషన్‌ వారు నిర్వహించిన ఆసియా ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించాడు. వీటిలో 9 దేశాల క్రీడాకారులు పాల్గొనగా, అందులోనూ బంగారు పతకం సాధించి అబ్బురపరిచాడు. ఇలా వరుసగా రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నెల్లూరు, గుంటూరు, విజయవాడలో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో 14 సార్లు బంగారు, మూడుసార్లు రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. ఆరుసార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని అయిదు బంగారు, ఒకసారి రజత పతకం సాధించాడు.

పోలీస్‌ అవ్వాలని...
మణికంఠకు చిన్నతనం నుంచి కరాటేతోపాటు పోలీస్‌ అవ్వాలన్నదే ఆశయం. కరాటే ద్వారా ఈ లక్ష్యానికి అవసరమైన దేహదారుఢ్యం సాధిస్తున్నాడు. కరాటేతో పాటు బాక్సింగ్‌, తైక్వాండో వంటి యుద్ధ విద్యల్లోనూ శిక్షణ తీసుకుంటున్నాడు. చదువుకూ సమాన ప్రాధాన్యం ఇస్తున్నాడు. రోజూ గుడ్లు, పాలు, డ్రైఫ్రూట్స్‌, మొలకెత్తిన విత్తనాలను తన ఆహారంలో భాగం చేసుకుంటున్నాడు. చిన్న వయసులోనే పెద్ద లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ చిన్నారికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా...! అలాగే మనమూ మారాం చేయకుండా ఎంచక్కా.. పౌష్టికాహారం తీసుకుందాం సరేనా!

- ఉప్పాల రాజాపృథ్వీ, ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని