Updated : 08 Apr 2022 02:01 IST

వయసు చిన్న.. ఘనతలు మిన్న!

హాయ్‌ పిల్లలూ.. ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుంచి హిస్టోరియన్‌ అవార్డూ.. వ్యోమనౌకపైన పేరూ.. అతడి పేరిట పోస్టల్‌ స్టాంపూ - ఇవన్నీ సాధించాలంటే బాగా చదువుకుని, ఎన్నో పరిశోధనలూ చేయాలి. అవన్నీ చేసినవారంటే వయసులోనూ ఎంతో పెద్దవారై ఉండాలి. అంతేకదా ఫ్రెండ్స్‌! కానీ, అతి చిన్న వయసులోనే ఈ ఘనతలన్నీ సాధించేశాడు ఓ నేస్తం. అతడెవరో, ఎలాగో తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి మరి!

త్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కాన్పూర్‌కు చెందిన యశ్‌వర్ధన్‌కు ప్రస్తుతం 11 సంవత్సరాలు. తల్లి స్కూల్‌ టీచర్‌. తండ్రి వైద్యుడు. మనలాంటి చాలామంది పిల్లలకు అంతగా నచ్చని సబ్జెక్టుల్లో చరిత్ర ఒకటి. కానీ, యశ్‌కు మాత్రం చరిత్ర అంటే చిన్నతనం నుంచే బోలెడు ఇష్టమట. ఆ మక్కువతోనే చరిత్రకు సంబంధించిన వివిధ పుస్తకాలు చదువుతూ.. లోతైన అధ్యయనంతో మంచి పట్టు సంపాదించాడు.

హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి..

చరిత్రలో యశ్‌ ప్రతిభను గుర్తించిన అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం ‘యంగెస్ట్‌ హిస్టోరియన్‌’ అవార్డును అందించింది. ఇంత చిన్న వయసులోనే అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ఈ నేస్తం పేరు మీద భారత తపాలా శాఖ ఓ స్టాంపును కూడా విడుదల చేసింది. అదేదో సాదాసీదాగా అని అనుకోకండి ఫ్రెండ్స్‌.. ఆ స్టాంపుపైన అతడి ఫొటో కూడా ముద్రించారట. అంతేకాదు.. గత నెలలో నాసా సంస్థ చంద్రుడి మీదకు పంపిన స్పేస్‌క్రాఫ్ట్‌లో యశ్‌ పేరునూ జోడించిందట.  

సివిల్స్‌ అభ్యర్థులకే పాఠాలు..  

ఎంతో మందికి జీవిత కల.. సివిల్‌ సర్వీసెస్‌. పెద్ద పెద్ద వారికే ఈ సివిల్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం అంత సులువు కాదు. ఇక అటువంటి వారికి కోచింగ్‌ ఇవ్వాలంటే ఎంత విజ్ఞానం ఉండాలో మీరే ఒకసారి ఆలోచించండి. అలాంటిది యశ్‌, బడికి వెళ్తూనే రోజూ 10 గంటలపాటు సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ సంబంధాలు (ఇంర్నేషనల్‌ రిలేషన్స్‌)లో బంగారు పతకమూ సాధించాడీ నేస్తం.

తల్లే స్ఫూర్తి..

‘ఇంత చిన్న వయసులోనే ఇవన్నీ ఎలా సాధ్యం?’ అని యశ్‌ని అడిగితే.. తన తల్లే స్ఫూర్తి అని చెబుతున్నాడు. 2017లో యశ్‌ వాళ్ల అమ్మ సివిల్‌ పరీక్షలకు సన్నద్ధమైంది. ఎలాగైనా ర్యాంక్‌ సాధించాలని పగలూ, రాత్రీ తేడా లేకుండా చదువుతూనే ఉండేదట. అప్పుడు యశ్‌కు ఆరేళ్లు. ఆ వయసులోనే అమ్మ పక్కనే కూర్చొని.. ఆమె ఏం చదువుతుందో, ఆ అంశాలను ఎలా అర్థం చేసుకుంటుందో ఆసక్తిగా గమనించేవాడు. అప్పటి నుంచీ హిస్టరీ, జాగ్రఫీ, స్పేస్‌ తదితర అంశాలపైన ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టమే పిన్న వయసులోనే యశ్‌కు ఇంత జ్ఞానంతో పాటు అవార్డులనూ తీసుకొచ్చింది. భవిష్యత్తులో ఇండియన్‌ ఫారెస్టు సర్వీసెస్‌(ఐఎఫ్‌ఎస్‌)కు ఎంపికై.. తనలాంటి పిల్లలకు స్ఫూర్తిగా నిలవాలనేది తన లక్ష్యమని యశ్‌ చెబుతున్నాడు. ఇన్ని ఘనతలు సాధించిన ఈ బాల మేధావికి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు