Updated : 12 Apr 2022 06:35 IST

శెభాష్‌ దీప!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనం పాఠశాలకు వెళ్లివచ్చేటప్పుడో, సెలవు రోజుల్లో ఆడుకునేటప్పుడో బయట ఏదైనా విలువైన వస్తువు కనిపిస్తే ఏం చేస్తాం? - ఆ వస్తువు గురించి అక్కడున్న స్నేహితులను అడగడమో, ఉపాధ్యాయులకు చూపించడమో లేదా నేరుగా ఇంటికి తీసుకెళ్లి అమ్మానాన్నలకు చెప్పడమో చేస్తాం కదా! అలాగే, ఓ నేస్తం కూడా తన నిజాయతీకి బోలెడు అభినందనలు అందుకుంటోంది. ఇంతకీ తనెవరో, ఏం చేసిందో చదివేయండి మరి..

మిళనాడు రాష్ట్రంలోని మధురైకి చెందిన దీపాప్రభకు ఆరేళ్లు. ప్రస్తుతం స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఇటీవల ఒకరోజు తను ఉదయం నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తుండగా,  రోడ్డుపైన రూ.50 నోటు ఒకటి కనిపించింది. వెంటనే, దాన్ని తీసుకెళ్లి క్లాస్‌ టీచర్‌ రామలక్ష్మికి అందించింది. ఎందుకో అనుమానం వచ్చిన ఆమె.. తన హ్యాండ్‌బ్యాగ్‌ బయటకు తీసి చూసుకుంది. దొరికిన ఆ యాభై రూపాయల నోటు తనదేనని గుర్తించింది.

సహచరులతో చప్పట్లు...

కూలీ పనులు చేసుకునే కుటుంబమైనా.. దొరికిన డబ్బును తీసుకొచ్చి ఇచ్చిన దీప నిజాయతీని ఆ టీచర్‌ అభినందించారు. అంతేకాదు.. తరగతి గదిలోని 41 మంది విద్యార్థులకూ విషయం చెప్పి, వారందరితో చప్పట్లు కొట్టించారు. క్లాసు పూర్తయిన తర్వాత.. చిన్నారిని స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడి దగ్గరకు తీసుకెళ్లింది టీచర్‌.

ప్రధానోపాధ్యాయుడి సీట్లో...

చిన్నారి చేసిన పని గురించి తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు.. ఆరోజు మొత్తం దీపను తన సీట్లో కూర్చోబెట్టి ఊహించని బహుమతి అందించారు. దాంతోపాటు.. సాయంత్రం ప్రార్థన సమయంలో పాఠశాల విద్యార్థులందరి ముందూ చిన్నారిని అభినందించారాయన. ‘రోడ్డుపైన దొరికిన నోటు విలువ తక్కువే కావొచ్చు.. కానీ దీప తన నిజాయతీతో అనేకమంది మనసులు గెలుచుకుంది. చిన్నవయసులోనే ఇంత క్రమశిక్షణ కలిగి ఉండటం గొప్ప విషయం. తల్లిదండ్రులు కూడా తనని చూసి గర్వపడతారు’ అని ఇతర ఉపాధ్యాయులూ చిన్నారిని ప్రోత్సహించారు. ఈ నేస్తంలాగే నిజాయతీగా ఉంటూ.. మనమూ మంచి పేరు తెచ్చుకుందాం ఫ్రెండ్స్‌!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు