Published : 15 Apr 2022 00:28 IST

‘భవ్య’మైన ప్రతిభ!

హాయ్‌ పిల్లలూ.. సరదాగా పుస్తకంలోని కాగితాలపైననో, స్కూల్‌ ప్రాజెక్టులో భాగంగా ఛార్టుల మీదనో అప్పుడప్పుడూ మనం డ్రాయింగ్‌ వేస్తుంటాం కదా! అలాగే, ఓ నేస్తం కూడా చిత్రకళలో మెలకువలు నేర్చుకుంటూ.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. అవార్డులు సాధిస్తూ.. ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తోంది. ఇంతకీ తనెవరో, ఆ వివరాలేంటో చదివేయండి మరి!

కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్‌ జిల్లాకు చెందిన భవ్య ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. చిన్నతనం నుంచే తనకు బొమ్మలు గీయడం అంటే బోలెడు ఆసక్తి. తెల్ల కాగితం, బాటిల్‌, పూల కుండీ.. ఇలా ఏది కనిపించినా, దాన్ని ఓ కళాఖండంలా తీర్చిదిద్దేది. ఆ ఇష్టమే.. తనకు బోలెడు పేరుతోపాటు అవార్డులనూ తీసుకొచ్చింది.

టాబ్లెట్‌పైన ఇండియా మ్యాప్‌
జ్వరమొస్తే వేసుకొనే డోలో మాత్రను రెండు ముక్కలు చేయాలంటేనే ఆపసోపాలు పడతాం. అలాంటిది.. ఆ టాబ్లెట్‌పైన ఏకంగా ఇండియా మ్యాప్‌నే గీసేసింది భవ్య. ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఇటీవల ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు దక్కింది.

ఖాళీ సీసాలే కాన్వాసులు..
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ సమయాన్ని ఈ నేస్తం చక్కగా వినియోగించుకుంది. పాఠశాలలు మూతబడటం, ఇంటికే పరిమితం కావడంతో.. తనలోని చిత్రకళకు మెరుగులు దిద్దుకుంది. గాజు, ప్లాస్టిక్‌ సీసాలపైన సచిన్‌, మమ్ముట్టి వంటి ప్రముఖుల చిత్రాలతోపాటు ప్రకృతి, వివిధ డిజైన్లనూ గీసింది. లాక్‌డౌన్‌ కాలంలో ఇలా దాదాపు 65కుపైగా రకరకాల బొమ్మలు వేసిందట. అంతేకాదు.. పాకెట్‌ మనీ కోసం భవ్యనే సొంతంగా కేకులు తయారు చేసి విక్రయిస్తూ.. డబ్బులు సంపాదిస్తోంది. కొత్తగా భరతనాట్యం నేర్చుకుంటున్నాననీ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయని గర్వంగా చెబుతోందీ నేస్తం. మనమూ ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా.. ఏదైనా కొత్తగా నేర్చుకుందాం ఫ్రెండ్స్‌..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు