చిట్టి చేతులు.. చక్కని రాతలు!

పదేళ్ల పిల్లలు ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు. పాఠ్య పుస్తకాలతో కుస్తీ పడతారు. కానీ ఓ చిన్నారి మాత్రం ఏకంగా ఓ పుస్తకమే రాసింది. ఆ పాప ఎవరు? ఆ పుస్తకం సంగతులేంటో తెలుసుకుందామా మరి.

Published : 17 Apr 2022 01:46 IST

పదేళ్ల పిల్లలు ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు. పాఠ్య పుస్తకాలతో కుస్తీ పడతారు. కానీ ఓ చిన్నారి మాత్రం ఏకంగా ఓ పుస్తకమే రాసింది. ఆ పాప ఎవరు? ఆ పుస్తకం సంగతులేంటో తెలుసుకుందామా మరి.

చారునైనిక కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో అయిదో తరగతి చదువుతోంది. ఈ చిన్నారి తాను రాసిన పుస్తకాన్ని ఇటీవలే విడుదల చేసింది. ‘ది అన్‌నోన్‌ ఫ్రెండ్‌’ అనే పేరుతో రాసిన ఈ పుస్తకం ఊహల చుట్టూ సాగుతుంది.  

అసలు ఎందుకు రాసిందంటే..

నైనికకు ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ఉంది. అందులో తాను చదివిన పుస్తకాల గురించి రివ్యూలు చెబుతుంది. ‘ది ఎలిఫెంట్‌’ అనే పుస్తకం మీద కూడా ఇలాగే రివ్యూ చెప్పి దాన్ని తన యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఈ పుస్తకాన్ని పీటర్‌ అనే ఆస్ట్రేలియాకు చెందిన రచయిత రాశారు. ఆయన ఈ రివ్యూను చదివి చాలా మెచ్చుకున్నారు. మరిన్ని పుస్తకాలు చదివి, మరిన్ని రివ్యూలు చెప్పమని ప్రోత్సహించారు. సొంతంగా కథలు కూడా రాయమన్నారు.

తల్లిదండ్రుల సాయం లేకుండానే...

పీటర్‌ సలహా మేరకు నైనిక కథలు రాయడం ప్రారంభించింది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పనిలో తీరిక లేకుండా ఉండటం వల్ల చిన్నారి తల్లిదండ్రులు కూడా పెద్దగా సాయం చేయలేకపోయారు. అయినా నైనిక చక్కని కథలకు ప్రాణం పోసింది. ఇలా ఈ చిన్నారి ‘ది అన్‌నోన్‌ ఫ్రెండ్‌’ అనే కథల పుస్తకాన్ని ఇటీవలే విడుదల చేసింది. మీకు మరో విషయం తెలుసా.. పుస్తకానికి సంబంధించిన ఆర్ట్‌వర్క్‌ కూడా తానే సొంతంగా చేసుకుంది. తనను ఈ పుస్తకం రాయడానికి ప్రోత్సహించిన స్కూల్‌ ప్రిన్సిపల్‌, తన నాన్నకు నైనిక కృతజ్ఞతలు చెప్పుకుంది. మొత్తానికి ఇంత చిన్న వయసులోనే పుస్తకం రాసిన చారునైనిక నిజంగా గ్రేట్‌ కదూ! ఇంకేం మీరూ పెన్ను, పేపర్లు పట్టండి. ఎంచక్కా కథలు రాసేయండి. ఎవరికి తెలుసు.. మీలోనూ మంచి రచయిత దాగి ఉన్నారేమో!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని