Published : 21 Apr 2022 00:54 IST

చిట్టి చేతులు.. చక్కని చిత్రాలు..

పేదరికం ప్రతిభకు ప్రతిబంధకం కాదని నిరూపిస్తోంది ఈ బాలిక.. జీవం ఉట్టిపడే చిత్రాలతో చూపరులను కట్టి పడేస్తోంది. ఎన్నో జిల్లా, రాష్ట్రస్థాయి బహుమతులతోపాటు, పలు రికార్డులు కూడా సొంతం చేసుకుంది.

ఆ చిన్నారి చిత్రకారిణి ఎవరో కాదు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం రావులపేట గ్రామానికి చెందిన కె.లీలాశ్రుతి. ఈ చిన్నారి వయస్సు 14 ఏళ్లు. మండపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో తొమ్మిదోతరగతి చదువుతోంది. తండ్రి కౌలు వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పాలు అమ్ముతారు. తల్లి రాజేశ్వరి గృహిణి. శ్రుతికి చిన్నతనం నుంచి చిత్రలేఖనం అంటే ఇష్టం ఉండేది.

అమ్మ ప్రోత్సాహంతో...
ఈ చిన్నారికి కాస్త బెరుకు ఎక్కువ. అందుకే ఇంట్లో బొమ్మలు గీయటమే తప్ప పోటీలకు వెళ్లలేదు. 5వ తరగతిలో ఉన్నప్పుడు అమ్మ ప్రోత్సాహంతో మండపేటలో నిర్వహించిన ఓ చిత్రలేఖనం పోటీలో పాల్గొంది. అక్కడ ప్రథమ బహుమతి రావడంతో తనమీద తనకు నమ్మకం ఏర్పడింది. శ్రుతి అభిరుచి గమనించి తమకు ఆర్థిక భారం అయినా శిక్షకుడు సత్యానందం దగ్గర చేర్పించారు తల్లిదండ్రులు.

బహుమతులే  బహుమతులు!
శ్రుతి జీవితంలో చిత్ర కళ మొదట బెరుకు, భయంతో మొదలైనా.. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గెలుచుకున్న బహుమతులు తనను ముందుకు నడిపించాయి. ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతో గత ఏడాది 66,600 ముత్యాలతో రామకృష్ణ పరమహంస చిత్రాన్ని ఏడు రోజులు పరిశ్రమించి రూపొందించింది. ఇందుకు గాను ‘తెలుగుబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం దక్కింది. కాకినాడలో జీవవైవిధ్య సంస్థ, కోనసీమ చిత్రకళా పరిషత్తు నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచింది. తన చిత్రకళా ప్రతిభకు మెచ్చి ఈ ఏడాది జనవరిలో ‘మెగా రికార్డ్స్‌’ సంస్థ స్వామి వివేకానంద అవార్డును అందించింది. మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో రిజర్వ్‌ బ్యాంకువారు ఆన్‌లైన్లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో మొదటి బహుమతి పొందింది. మార్చి 20న విజయవాడ స్ఫూర్తి అకాడమీ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి వచ్చింది. ఇంత చిన్న వయసులోనే ఇన్ని ఘనతలు సాధించడం నిజంగా గ్రేట్‌ కదూ!

- ఉప్పాల రాజాపృథ్వీ, ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని