చిరుత... కరాటేలో ఘనత!

తొమ్మిదేళ్ల వయసులోనే పతకాల పంట పండిస్తున్నాడు ఓ బుడతడు. కరాటేలో రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధించి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తాజాగా ఆసియా దేశాల అంతర్జాతీయ కరాటే పోటీల్లో  స్వర్ణంతో సత్తాచాటాడు.

Published : 27 Apr 2022 00:29 IST

తొమ్మిదేళ్ల వయసులోనే పతకాల పంట పండిస్తున్నాడు ఓ బుడతడు. కరాటేలో రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధించి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తాజాగా ఆసియా దేశాల అంతర్జాతీయ కరాటే పోటీల్లో  స్వర్ణంతో సత్తాచాటాడు. మరి ఆ చిచ్చర పిడుగు గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా!

ఆ చిన్నారి కరాటే వీరుడు ఎవరో కాదు.. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం పరిధిలోని తోటపేటకు చెందిన యాళ్ల సురేష్‌కుమార్‌. వయసు 9 ఏళ్లు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. తండ్రి అంజిబాబు ఆటో బ్యాటరీల దుకాణంలో పనిచేస్తారు. అమ్మ దుర్గాదేవి గృహిణి. సురేష్‌.. కరాటే నేర్చుకుంటానని నిత్యం మారాం చేసేవాడు. దీంతో తల్లిదండ్రులూ ఆర్థిక ఇబ్బందులున్నా కొడుకు అభిరుచి గురించి చెప్పగానే ఒప్పుకొన్నారు. ఇలా ఈ నేస్తం రెండేళ్ల నుంచి శిక్షణ తీసుకుంటూ అనేక పోటీల్లో పతకాలు సాధించాడు.

పతకాల పంట..
చిన్నారి సురేష్‌ 2020లో జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచాడు. 2021లో గాజువాకలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో విజేతగా నిలిచాడు. దీంతో 2022 ఫిబ్రవరిలో ‘నిజి షోటోఖాన్‌ స్పోర్ట్స్‌ కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ వారు నిర్వహించిన ఆసియా ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించాడు. ఇందులో 9 దేశాల క్రీడాకారులు పాల్గొనగా, రజతంతో మెరిశాడు. విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ ఆసియా టోర్నమెంట్‌లో బంగారు పతకం సాధించాడు. రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో నాలుగు సార్లు బంగారు, మూడుసార్లు రజత పతకాలు గెలుచుకున్నాడు. ఇంత చిన్న వయసులోనే ఇన్ని ఘనతలు సాధించిన సురేష్‌.. పెద్దయ్యాక సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తానంటున్నాడు. మరి ఈ బుడతడికి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!

- ఉప్పాల రాజాపృథ్వీ, ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని