Published : 30 Apr 2022 01:06 IST

ఆడుతూ పాడుతూ.. లెక్కలు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు కొన్ని సబ్జెక్టులు బాగా నచ్చుతాయి.. ఇంకొన్నేమో భయపెడతాయి. ఆ జాబితాలో మొదటి వరసలో ఉండేది గణితమే కదా! ఆ అంకెలూ, సంఖ్యలూ, సమీకరణాలూ, టేబుల్సూ.. ఇలా లెక్కల్లో ప్రతీది చాలామందికి కష్టంగానే అనిపిస్తుంటుంది. అందుకే, గణితాన్ని పిల్లలకు ఆసక్తికరంగా మార్చేందుకు ఓ మాస్టారు వినూత్న ప్రయోగం చేశారు. అదేంటో చదివేయండి మరి.

సుభాష్‌ చంద్ర సాహు.. ఒడిశా రాష్ట్రంలోని పుజరిపాలి గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ఆయన ఈ బడికి వచ్చిన కొత్తలో అధిక శాతం విద్యార్థులు గణితం అంటే చాలా భయపడిపోయేవారట. ఎలాగైనా వారిలో ఆ భయాన్ని తొలగించాలని అనుకున్నారాయన. అందులో భాగంగా పాఠశాల ఆవరణలో ఏకంగా ‘గణిత పార్కు’ను ఏర్పాటు చేశారు. పిల్లలంతా ఆడుతూ పాడుతూ లెక్కలు నేర్చుకునేలా రకరకాల గుర్తులు, సంజ్ఞలతో ఈ పార్కును తీర్చిదిద్దారు.

గ్రామస్థుల సహకారంతో..
గణిత పార్కులోని రాళ్ల దగ్గరి నుంచి బెంచీలు, చెట్ల మొదళ్లు, సిమెంటు దిమ్మెలు.. ఇలా ప్రతీది లెక్కల సబ్జెక్టుకు సంబంధించిన అంశాలతోనే రూపొందించారు. కొందరు గ్రామస్థులతో పాటు ఉపాధ్యాయుడు సాహునే దీనికైన ఖర్చునంతా భరించారు. ఇటీవలే ప్రారంభించిన ఈ పార్కును చూసేందుకు.. చుట్టుపక్కల గ్రామాల్లోని పిల్లలతోపాటు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి కూడా వస్తున్నారట.

లాక్‌డౌన్‌లో..
లాక్‌డౌన్‌ సమయంలో పిల్లలు చదువులకు దూరం కాకూడదనీ ఈ ఉపాధ్యాయుడు చేసిన ప్రయత్నం గ్రామానికే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. వర్ణమాలలు, వివిధ మ్యాప్స్‌, ఇతర బోధనాంశాలను రంగురంగుల చార్టులపైన రాసి.. చెట్లకు వేలాడదీసి పిల్లలకు పాఠాలు చెప్పారు. అంతేకాదు.. గ్రామంలోని ఇళ్ల వెలుపల, రోడ్లకు ఇరువైపులా స్వాతంత్య్ర సమరయోధులూ, ఇతర అంశాలతో కూడిన చార్టులను అంటించారు. చిన్నా పెద్దా ఎవరైనా బయటకు వచ్చినప్పుడు ఆసక్తిగా చదువుకునేలా వాటిని తయారు చేశారాయన. ‘సాధారణంగా పిల్లలు ఆంగ్లం, గణితం అంటే ఆందోళనకు గురవుతుంటారు. వారికి ఆ అంశాలను సులువుగా, సరదాగా నేర్పిస్తే.. ఇష్టం పెంచుకుంటారనీ నా ప్రయత్నం’ అని చెబుతున్నారు ఈ ఉపాధ్యాయుడు. ఎంత మంచి మాస్టారో కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని