బరిలో దిగితే గురి తప్పదు!

వాళ్లిద్దరిదీ ఒకే స్కూలు. ఇద్దరూ చదివేది పదో తరగతే. కానీ, వాళ్లు విల్లు ఎక్కుపెడితే అందరూ అవాక్కవ్వాల్సిందే! బాణం సంధిస్తే పతకం వరించాల్సిందే. మరి వాళ్లిద్దరూ ఎవరు.. వాళ్ల వివరాలేంటో తెలుసుకుందామా!

Updated : 01 May 2022 04:50 IST

వాళ్లిద్దరిదీ ఒకే స్కూలు. ఇద్దరూ చదివేది పదో తరగతే. కానీ, వాళ్లు విల్లు ఎక్కుపెడితే అందరూ అవాక్కవ్వాల్సిందే! బాణం సంధిస్తే పతకం వరించాల్సిందే. మరి వాళ్లిద్దరూ ఎవరు.. వాళ్ల వివరాలేంటో తెలుసుకుందామా!

మహారాష్ట్రలోని సాంగ్లీలో ఇటీవల ‘సబ్‌ జూనియర్‌ అండర్‌-17 స్టేట్‌ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌’ పోటీలు జరిగాయి. వీటిలో.. పుణెలోని ‘విఖే పాటిల్‌ మెమోరియల్‌ స్కూల్‌’లో చదువుతున్న ప్రాచీ ఛటర్జీ రెండు స్వర్ణాలు, రెండు కాంస్యాలు కైవసం చేసుకుంది. మహారాష్ట్ర తరఫున నేషనల్‌ మీట్‌లో పాల్గొనే అవకాశమూ దక్కించుకుంది. ఓ వైపు చదువుల్లో రాణిస్తూనే, మరో వైపు విలువిద్యలో సత్తా చాటుతోంది. తనకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే విల్లంబును చేతబట్టి లక్ష్యాలకు గురిపెట్టడం నేర్చుకుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని ధీమాగా చెబుతోంది. 

వయసులో చిన్న.. ప్రతిభలో మిన్న!

వన్షీ మితేష్‌ ఇటీవల జంషెడ్‌పూర్‌లో జరిగిన ‘ఖేలో ఇండియా నేషనల్‌ ర్యాంకింగ్‌ ఉమెన్‌ ఆర్చరీ టోర్నమెంట్‌’లో పాల్గొని సత్తా చాటింది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న వారందరిలోకెల్లా 14 సంవత్సరాల వన్షీనే వయసులో చిన్న. ఈ చిన్నారి వరసగా నాలుగు ఎలిమినేషన్‌ మ్యాచ్‌లు గెలిచి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. జాతీయ జట్టులో సభ్యురాలితో పోటీలోనూ.. వన్షీ మెరుగైన ప్రదర్శన చేసింది. కానీ రెండో ర్యాంక్‌ క్రీడాకారిణి మీద ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మున్ముందు మరింత మెరుగైన ప్రదర్శన కనరబరచాలనే ఆశయంతో ముందుకు అడుగులు వేస్తోంది. వన్షీ కూడా ప్రాచీలాగే విలువిద్యతో పాటు చదువులోనూ రాణిస్తోంది. ఇలా మొత్తానికి ఈ ఇద్దరూ తాము చదువుతున్న పాఠశాలకు మంచి పేరు తీసుకువస్తున్నారు. ఎంతైనా వీళ్లిద్దరూ నిజంగా గ్రేట్‌ కదూ! 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని