Published : 05 May 2022 01:06 IST

మండుటెండల్లో బాలుడి మంచితనం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. వయసు చిన్నదైనా, మానవత్వంలో మాత్రం అందరినీ మించిపోయాడో బాలుడు. ఎదుటివారి కష్టాలకు స్పందించే గుణమున్న ఆ నేస్తం చేసిన పనిని.. ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా.. ఆ చిన్నోడి గురించే! ఇంతకీ అతడేం చేశాడో తెలుసుకుందాం రండి.

ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉక్కపోత, వేడితో కాలు బయటపెట్టలేని పరిస్థితి. ఎలాగూ పరీక్షలు అయిపోయాయి.. బడులకూ సెలవులిచ్చారు కాబట్టి మనమంతా ఎంచక్కా ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తుంటాం. కానీ, అందరి పరిస్థితి ఒకేలా ఉండదు కదా నేస్తాలూ.. ఎండైనా, వానైనా వీధి వ్యాపారులూ.. కూలీలూ రోజూ పనికి వెళ్లాల్సిందే. ఈ క్రమంలో బాలుడు అయాన్‌ చేసిన ఓ మంచిపని వైరల్‌గా మారింది.

కష్టాన్ని గమనించి..
మహారాష్ట్రకు చెందిన అయాన్‌ ఇటీవల ఒకరోజు బయటి నుంచి ఇంటికి వెళ్తున్నాడు. దారిలో ఓచోట ఎండలోనే కూర్చొని అవస్థలు పడుతున్న వీధి వ్యాపారులను గమనించాడు. వాళ్లకు ఏదైనా సాయం చేయాలని అనుకున్నాడు. తన ఆలోచనను పెద్దవాళ్లకు చెప్పడంతో.. సాయానికి వారూ సరేనన్నారు.

దాహం తీర్చేలా..
మరుసటి రోజు ఒక పెద్ద కవర్‌లో కొన్ని వాటర్‌ బాటిళ్లను తీసుకొచ్చిన అయాన్‌.. ఫుట్‌పాత్‌ పైన పూలు, ఇతర సామగ్రి విక్రయించే చిరువ్యాపారులకు ఉచితంగా పంపణీ చేశాడు. చెమటలు కక్కుతున్నా.. సంచీ బరువుగా ఉన్నా.. లెక్కచేయకుండా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి మరీ.. బాటిళ్లను అందించి దాహం తీర్చాడు. ఈ వీడియోను ఐఏఎస్‌ అధికారి అవనీశ్‌ శరణ్‌.. సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఎండలకు అల్లాడుతున్న పిల్లలూ, వృద్ధులూ, మహిళల దప్పిక తీర్చడం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బుడతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘మంచి మనసుతో చేసే పని చిన్నదైనా.. ఇతరులకు పెద్ద మేలు జరగవచ్చు’ అని నిరూపించిన ఈ నేస్తం నిజంగా గ్రేట్‌ కదూ! ఇదే స్ఫూర్తితో మనమూ పక్షుల కోసం ఇంటి వరండాలో నీళ్లు, గింజలు ఉంచుదాం. కష్టాల్లో ఉన్న మనుషులకు చేతనైన సాయం చేద్దాం ఫ్రెండ్స్‌...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు