నేనో చిన్న బైక్‌నోచ్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఎలా ఉన్నారు. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఏంటి అలా వింతగా చూస్తున్నారు. నేను ఎవరనా? నేనో బుజ్జి బైక్‌ను. ప్రపంచంలోకెల్లా అతిచిన్న బైక్‌ను నేనే.. నా పేరు మీద గిన్నిస్‌ బుక్‌ రికార్డు కూడా ఉంది తెలుసా

Published : 06 May 2022 00:37 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఎలా ఉన్నారు. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఏంటి అలా వింతగా చూస్తున్నారు. నేను ఎవరనా? నేనో బుజ్జి బైక్‌ను. ప్రపంచంలోకెల్లా అతిచిన్న బైక్‌ను నేనే.. నా పేరు మీద గిన్నిస్‌ బుక్‌ రికార్డు కూడా ఉంది తెలుసా.. మరి నా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
నా పేరు స్మాల్‌టోయ్‌.. అగ్గిపెట్టె కంటే కొంచెం ఎత్తున్న నా బరువు ఎంత ఉంటుందో తెలుసా..? కేవలం 1.1 కిలోగ్రాములంతే! నాకుండే ఇంజిన్‌ సామర్థ్యం ఎంతంటే.. 0.3 హార్స్‌పవర్‌. నా వేగం ఎంతో తెలుసా? గంటకు రెండు కిలోమీటర్లు. నాకు టామ్‌ విబర్గ్‌ అనే వ్యక్తి 2003లో ప్రాణం పోశాడు. అప్పటి నుంచి ప్రపంచంలోకెల్లా అతిచిన్న బైక్‌ రికార్డు నా పేరు మీదే ఉంది. మీకో విషయం తెలుసా.. నాకో అన్న కూడా ఉన్నాడు. వాడిపేరు బిగ్‌టోయ్‌. దీన్ని కూడా టామ్‌ విబర్గే తయారు చేశాడు. ఒకప్పుడు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బైక్‌ రికార్డు దీని పేరు మీదే ఉండేది. కానీ తర్వాత అది బ్రేక్‌ అయింది. నా రికార్డు మాత్రం ఇంకా పదిలంగానే ఉంది.
నన్ను నడపాలంటే..!
అరచేతిలో ఇమిడిపోయే నన్ను అన్ని బైకుల్లా నడపాలంటే కుదరదు. అందుకోసం స్టీల్‌ ప్లేట్లు, ప్రత్యేక షూస్‌ ఉండాల్సిందే. నాకు హెడ్‌లైట్లు ఉండనే ఉండవు. నంబర్‌ ప్లేటు కూడా ఉండదోచ్‌. ఎందుకంటే నాకు రోడ్ల మీద పరుగులు పెట్టడానికి.. సారీ పాకడానికి అనుమతి లేదు మరి! నన్ను కేవలం గిన్నిస్‌బుక్‌లో రికార్డు కోసమే తయారు చేశారు. సరే ఫ్రెండ్స్‌ ఇక ఉంటామరి. డుర్ర్‌.. డుర్ర్‌... ఏంటి అలా చూస్తున్నారు... నా భాషలో మీకు బై.. బై.. చెబుతున్నా.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని