Published : 10 May 2022 00:36 IST

పిట్ట కొంచెం.. గీత ఘనం!

ఆ చిన్నారి బొమ్మను గీస్తే...దాన్ని ఎవరైనా చూస్తే..కచ్చితంగా ఔరా.. అనాల్సిందే! చిత్రకళా పోటీలో పాల్గొంటే..బహుమతి రావాల్సిందే! అంత అద్భుత ప్రతిభను కనబరుస్తున్న ఆ చిట్టి చిత్రకారిణి ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకెందుకాలస్యం
ఈ కథనం చదివేయండి!

ఆ చిన్నారి ఎవరో కాదు. తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన ఇళ్ల దివ్యశ్రీ. వయసు 14 ఏళ్లు. మండపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి శ్రీనివాస్‌ స్థానిక పాల డెయిరీలో పని చేస్తున్నారు. తల్లి కాశీ ఈశ్వరి గృహిణి. దివ్యకు ఎవరూ చిత్రాలు గీయమని చెప్పలేదు. అందమైన బొమ్మ కనిపిస్తే చాలు దాన్ని మరింత అందంగా గీయాలన్న ఆలోచనే తనకు చిత్రలేఖనంపై మక్కువ పెరిగేలా చేసింది. 10 ఏళ్ల ప్రాయం నుంచి బొమ్మలు గీయటం మొదలు పెట్టింది. తన అభిరుచిని గుర్తించిన తల్లిదండ్రులు ప్రోత్సహించి శిక్షణ ఇప్పించారు.

మరింతగా సాధన చేసి..
పాఠశాల స్థాయి పోటీల్లో బహుమతులు రావటంతో దివ్యలో చిత్రలేఖనంపై ఇంకా ఆసక్తి పెరిగింది. దీంతో మరింతగా సాధన చేయటం మొదలుపెట్టింది. 2019లో అమలాపురంలో కోనసీమ చిత్రకళా పరిషత్తు నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో ప్రథమస్థానం సాధించింది. ఈ పోటీల్లో దాదాపు 400 మంది వరకూ పాల్గొన్నారు. 2021లో మదర్‌ థెరిస్సా ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ వారు ఆన్‌లైన్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటి బహుమతి సాధించింది. ఇటీవల భద్రాచలం ఫైన్‌ఆర్ట్స్‌ అకాడమీ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రథమ బహుమతి పొంది ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది.

వ్యాపకంలా కాకుండా...
చిత్రకళను దివ్య కేవలం వ్యాపకంలా కాకుండా జీవిత గమనంగా ఎంచుకుంది. ఫ్యాషన్‌ డిజైనర్‌ అవ్వాలని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోంది. ఇంటర్‌ పూర్తి అవ్వగానే బీఎఫ్‌ఏ(బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌) చేయాలనుకుంటోంది. చిత్రకళకు, చదువుకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో దివ్య మరిన్ని విజయాలు సాధించాలని మనం ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా మరి.

- ఉప్పాల రాజాపృథ్వీ, ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని