మాటల్లో దిట్ట.. పుస్తకాల పుట్ట!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఆరేళ్ల వయసులో మనం ఏం చేస్తుంటాం - మారాం చేస్తూ బడికి వెళ్తుంటాం.. బాగా అల్లరిగా ఉంటాం. కానీ, ఓ పాప మాత్రం పెద్ద పెద్ద వేదికలపైన గలగలా మాట్లాడుతూ.. బోలెడు పుస్తకాలు చదువుతూ రికార్డుల మీద రికార్డులు కొట్టేస్తోంది.

Published : 13 May 2022 01:52 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఆరేళ్ల వయసులో మనం ఏం చేస్తుంటాం - మారాం చేస్తూ బడికి వెళ్తుంటాం.. బాగా అల్లరిగా ఉంటాం. కానీ, ఓ పాప మాత్రం పెద్ద పెద్ద వేదికలపైన గలగలా మాట్లాడుతూ.. బోలెడు పుస్తకాలు చదువుతూ రికార్డుల మీద రికార్డులు కొట్టేస్తోంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో, ఏమేం సాధించిందో చకచకా చదివేయండి.

కియారా కౌర్‌.. ఆరేళ్ల ఈ పాప పుట్టింది అమెరికాలోనైనా తల్లిదండ్రుల వృత్తిరీత్యా ప్రస్తుతం వారితోపాటే అబుదాబీలో నివసిస్తోంది. ఇటీవల దుబాయ్‌లో నిర్వహించిన ‘వరల్డ్‌ ఎక్స్‌పో-2022’లో అదరగొట్టింది. ‘స్మాల్‌ ఛేంజెస్‌-బిగ్‌ డిఫరెన్స్‌’ టాపిక్‌లో భాగంగా ‘మహిళా సాధికారత’ అనే అంశంపైన ప్రసంగించడమే కాకుండా అందరితో శెభాష్‌ అనిపించుకుంది. తాను ఈ అంశం ఎంపిక చేసుకునేందుకు 40 ఏళ్లపాటు ఆర్మీలో పనిచేసిన అమ్మమ్మే స్ఫూర్తి అనీ చెప్పింది. ‘విద్య, హక్కులు, ఆరోగ్యం, నిర్ణయాధికారాలు, అవకాశాలు, వేతనాల్లో బాలికలకు సమాన అవకాశాలు దక్కితేనే మహిళా సాధికారత’ అని కియారా చెప్పడంతో అక్కడి వారందరూ చప్పట్లతో అభినందించారు. అంతేకాదు.. ‘ప్రపంచంలోనే అతి చిన్న టెడెక్స్‌ స్పీకర్‌’గానూ ఘనత సాధించింది.

గతేడాది కూడా..

పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టపడే కియారా.. గతేడాది మహారాష్ట్రలో టెడెక్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని.. తన స్పీచ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎన్నో కష్టనష్టాలకు ఎదురొడ్డి నిలిచి.. విజయం సాధించిన వారి స్ఫూర్తి గాథలను పంచుకునే టెడెక్స్‌ వేదిక మీద, కేవలం అయిదేళ్ల వయసులోనే మాట్లాడటం కియారాకే సాధ్యమైంది. ఇందులో తనకు చదవడంపైన ఆసక్తి ఎలా కలిగిందో వివరించింది. ఆ ఏడాదిలోనూ ‘అతి చిన్న వయసు స్పీకర్‌’గా నిలిచింది.

పుస్తకమూ రాసింది...

నాలుగేళ్ల వయసులోనే గంటా 45 నిమిషాల్లోనే 36 పుస్తకాలు చదివి ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’తోపాటు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానమూ సాధించింది ఈ బాలిక. చిన్నతనంలోనే ఈ పాపకు పుస్తకాలు చదవడంపైనున్న ఆసక్తిని తల్లిదండ్రులు గమనించారు. బయటకు వెళ్లినప్పుడు గోడలపైన రాతలు, ప్రకటనలనూ అలవోకగా చదివేసేదట. ఓరోజు స్కూల్‌ లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుతుంటే టీచరే ఆశ్చర్యపోయారనీ, తమ కూతురికి చదవడంపైన ఆసక్తి పెరిగేందుకు ఆమె తాతయ్య కూడా కారణమేననీ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఏడు నెలలు కష్టపడి ఓ పుస్తకం కూడా రాసిందీ చిన్నారి. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతూ.. ఫ్రెంచ్‌, స్పానిష్‌ భాషలూ నేర్చుకుంటున్న ఈ నేస్తం.. పెద్దయ్యాక పేదవారికి అండగా నిలుస్తానని చెబుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని