Published : 24 May 2022 00:16 IST

పిల్లలే.. సమస్యలపైన కోర్టుకెళ్లారు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘మనం రోజూ ఇంటి నుంచి బడికి వచ్చివెళ్లే రోడ్డు బాగా లేకపోతే ఏం చేస్తాం?’ - కాంట్రాక్టర్‌నూ, అధికారులనూ, ప్రభుత్వాన్నీ తిట్టుకుంటాం. ఎలాగోలా రహదారిపైన గుంతలను తప్పించుకుంటూ.. ఆ మట్టిలోనే రాకపోకలు సాగిస్తాం. కానీ, కొందరు విద్యార్థులు అలా చేయలేదు. తమ ప్రాంతంలోని సమస్యలను చూసి వదిలేయకుండా.. దాని పరిష్కారానికి పెద్ద ప్రయత్నమే చేశారు. అదేంటో తెలుసుకుందాం రండి.

దిల్లీలో కాలుష్యం చాలా ఎక్కువ. దాని కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఇంకా చేయాల్సింది చాలా మిగిలే ఉంటోంది. దేశ రాజధాని దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో దుమ్ము, రోడ్ల సమస్య కూడా తీవ్రంగా ఉందట. ఆయా ప్రాంతాలకు చెందిన ఆరుగురు పాఠశాల విద్యార్థులు బృందంగా ఏర్పడి.. రోడ్ల సమస్యను పరిష్కరించాలని ఏకంగా అక్కడి హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారట. దాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అంతేకాదు.. కేసును జులై 19కి వాయిదా వేస్తూ, అప్పటిలోపు జరిగిన పనులపై ఓ రిపోర్టునూ అందించాలని అధికారులకు నోటీసులు ఇచ్చింది.  

దుమ్ముతో ఇబ్బందులు
ఆరుగురి బృందంలో ఒకరైన పదకొండేళ్ల బేణీ మాట్లాడుతూ ‘స్కూలుకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగానే.. ధూళితో నిండిన గాలే రోజూ మాకు స్వాగతం పలుకుతోంది. తప్పని పరిస్థితుల్లో ఆ కాలుష్యంలోనే ప్రయాణించి, క్లాసులో కూర్చుంటే తుమ్ములు, దగ్గుతో పాఠాలపైన దృష్టిసారించలేకపోతున్నాం. మా ఇబ్బందులను ఎవరూ పట్టించుకోకపోవడంతో మేమే పరిష్కారానికి అడుగు ముందుకు వేశాం’ అని వివరించింది.  

తవ్వి.. వదిలేశారట..
కేసు వేసిన ఆరుగురిలో అయిదుగురు విద్యార్థులు ప్రతి రోజూ ఒకే వాహనంలో బడికి వెళ్లి వస్తుంటారట. నిత్యం వారు రాకపోకలు సాగించే మార్గంలో ఒక వైపు రోడ్డును విద్యుత్తు సంబంధిత పనుల కోసం చాలా నెలల క్రితం తవ్వి అలాగే వదిలేశారట. దాంతో పెద్ద పెద్ద రాళ్లూ, గుంతలతో ఆ మార్గంలో ప్రయాణం అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు బడికి వెళ్లిరావడం కష్టంగా మారింది. మొదట్లో తమ పని కాదంటే, తమ పనీ కాదని అధికారులూ తప్పించుకోసాగారు. ఆ దుమ్ము, ధూళితో చిన్న పిల్లలూ, వృద్ధులూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ.. గుంతల్లో నీళ్లు నిలుస్తుండటంతో దోమలు పెరిగిపోయాయనీ పిల్లలు కోర్టుకు చెప్పడంతో.. న్యాయమూర్తులు సీరియస్‌ అయ్యారు. వెంటనే, సంబంధిత యంత్రాంగానికి గట్టి ఆదేశాలు ఇచ్చారు. దాంతో పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేస్తామని స్థానిక అధికారులు ఇప్పుడు చెబుతున్నారట. పోలీసు స్టేషన్లూ, కోర్టులూ అంటే సరిగ్గా తెలియని వయసులోనే.. ఈ ఆరుగురు చిన్నారులు చూపిన ధైర్యం నిజంగా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని