చిన్ని చేతులు అద్భుతాన్ని చేశాయి!

వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు.. ఒకరు పదో తరగతి, మరొకరు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో డోలు నేర్చుకున్నారు. ఇప్పుడు దేవాలయాలు, పెళ్లిళ్లలో డోలు వాయిస్తూ.. అందరూ అవాక్కయ్యేలా చేస్తున్నారు. ఆ వివరాలేంటో మనం తెలుసుకుందామా ఫ్రెండ్స్‌..

Published : 31 May 2022 00:43 IST

వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు.. ఒకరు పదో తరగతి, మరొకరు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో డోలు నేర్చుకున్నారు. ఇప్పుడు దేవాలయాలు, పెళ్లిళ్లలో డోలు వాయిస్తూ.. అందరూ అవాక్కయ్యేలా చేస్తున్నారు. ఆ వివరాలేంటో మనం తెలుసుకుందామా ఫ్రెండ్స్‌..

తమిళనాడు రాష్ట్రం కల్లకురిచిలో ఉంటున్న శివకలై, కలైవాని ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వీరిని తవిల్‌ సిస్టర్స్‌ అని పిలుస్తుంటారు. కరోనా సమయంలో వీళ్ల నాన్న శివ తంగదురై డోలు నేర్పించారు. తర్వాత గురువుగారి దగ్గర చేర్పించారు. వీళ్లకు నేర్చుకోవడానికి మూడు నెలల సమయం పట్టింది. మొదట్లో వీళ్లు చాలా కష్టపడ్డారు. తర్వాత్తర్వాత తేలికయింది. ఇప్పుడు వీళ్లు, వీళ్ల గురువుగారితో కలిసి దేవాలయాలు, వివాహాల్లోనూ డోలు వాయిస్తున్నారు. ఇలా ఈ అక్కాచెల్లెళ్లు.. వాళ్ల నాన్నగారి కలను సాకారం చేశారు.

పిల్లలన్నాక కూసింత కళాపోషణ...

‘నేటి కాలంలో పిల్లలు కేవలం పుస్తకాలకే పరిమితమవుతున్నారు. స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోతున్నారు. కళలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదు. నా ఇద్దరు పిల్లలూ డోలు నేర్చుకోవాలి అని అనుకున్నాను. శివకలై, కలైవాని నా ఆశయం నెరవేర్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది’ అని వీళ్ల నాన్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘పిల్లలన్నాక కళల్లో కాస్తైనా ప్రావీణ్యం ఉండాలి’ అనీ చెబుతున్నారు.

గురువు మెచ్చిన శిష్యులు..

ఈ తవిల్‌ సిస్టర్స్‌ కేవలం డోలు వాయించడంలోనే కాదు.. చదువుల్లోనూ చక్కగా రాణిస్తున్నారు. నిజానికి డోలు వాయించడం కాస్త కష్టమైన కళ. ఇందులో ఆడవాళ్లు రాణించడం చాలా అరుదు. కానీ ఈ అక్కాచెల్లెళ్లు చక్కగా నేర్చుకున్నారు. ‘నాకు వచ్చిందంతా వీళ్లకు నేర్పించాను. వీళ్లు చాలా త్వరగా నేర్చుకున్నారు. ఓసారి నేను ఓ కార్యక్రమానికి వెళ్లలేకపోయాను. నా బదులుగా వీళ్లే వెళ్లి డోలు వాయించారు. అక్కడ అందరి ప్రశంసలూ పొందారు. వీళ్లకు శిక్షణ ఇచ్చినందుకు నాకు గర్వంగా ఉంది’ అని గురువు శివశంకర్‌ అంటున్నారు. ఓ వైపు తండ్రి మన్ననలు, మరో వైపు గురువు ప్రశంసలు పొందిన ఈ తవిల్‌ సిస్టర్స్‌ నిజంగా గ్రేట్‌ కదూ! మరి వీళ్లు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని