క్లిక్‌లోనే కిక్కు!

మనం కాస్త సమయం దొరికినా చాలు స్మార్ట్‌ఫోన్‌తో కాలక్షేపం చేస్తాం. టీవీలో లీనమైపోతాం. ఇలా ఆటపాటలతో కాలం గడిపేస్తాం... ఓ నేస్తం మాత్రం తన కెమెరాతో ‘క్లిక్‌’మనిపిస్తున్నాడు.

Updated : 05 Jun 2022 05:44 IST

మనం కాస్త సమయం దొరికినా చాలు స్మార్ట్‌ఫోన్‌తో కాలక్షేపం చేస్తాం. టీవీలో లీనమైపోతాం. ఇలా ఆటపాటలతో కాలం గడిపేస్తాం... ఓ నేస్తం మాత్రం తన కెమెరాతో ‘క్లిక్‌’మనిపిస్తున్నాడు. అందులోనే తనకు కిక్కు ఉందనీ చెబుతున్నాడు. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

కర్ణాటకకు చెందిన 14 ఏళ్ల పి.అమోఘవర్ష అద్భుతంగా ఫొటోలు తీస్తాడు. ‘ఆఁ.. ఇందులో వింత ఏముందిలే మేమూ తీస్తాం..’ అంటారేమో.. కానీ మన వర్ష తీసేవి మామూలు ఫొటోలు కావు.. వన్యప్రాణులవి. అందులోనూ పులులను తన కెమెరాలో బంధిస్తున్నాడు. ఇటీవలే బెంగళూరులోని ‘చిత్రకళా పరిషత్‌’లో తాను తీసిన చిత్రాలను ప్రదర్శనకూ ఉంచాడు తెలుసా!

బాల్యం నుంచే...
వర్ష వాళ్ల నాన్న పి.ఎస్‌.హర్ష, అమ్మ డా.చైత్ర ఖాళీ దొరికినప్పుడల్లా తమతోపాటు వర్షను చిన్నప్పటి నుంచే అడవులకు తీసుకెళుతుండేవారు. ఇదే మన వర్షలో వన్యప్రాణులంటే ఆసక్తి పెరిగేలా చేసింది. వాటి గురించి తెలుసుకునేలా ప్రేరేపించింది.

పుట్టినరోజు కానుకగా..
వర్షకు తన తొమ్మిదో పుట్టినరోజు సందర్భంగా కెమెరా బహుమతిగా వచ్చింది. దాంతో మొట్టమొదటగా ఓ పక్షిని ఫొటో తీశాడు. ఇలా ఇప్పటి వరకు దాదాపు 140 రకాల పక్షుల చిత్రాలను తన కెమెరాలో బంధించాడు.

మూడు మీటర్ల దూరం నుంచి..
అలా అలా.. తన ఫొటోగ్రఫీ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుని, వారాంతాల్లో సమీప అడవుల్లోకి వెళ్లి వన్యప్రాణులను ఫొటోలు తీయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు వర్ష. ఒకసారైతే పెద్దపులికి కేవలం మూడు మీటర్ల దూరంలో ఉండి దాన్ని తన కెమెరాలో బంధించాడట.

మరి చదువుల్లో..
‘ఫొటోలు తీస్తున్నాడు సరే.. మరి చదువుల సంగతి ఏంటి?’ అనే అనుమానం మీకు ఈ పాటికే వచ్చి ఉంటుంది కదూ! తనకు ఫొటోగ్రఫీ అంటే ఎంత ఇష్టమున్నా.. చదువును నిర్లక్ష్యం చేయడం లేదు. దానికీ సమాన ప్రాధాన్యమిస్తున్నాడు మన వర్ష. ఈ నేస్తం భవిష్యత్తులో వైల్డ్‌ ఫొటోగ్రాఫర్‌గా మరిన్ని పేరుప్రతిష్ఠలు సంపాదించాలని మనమూ మనసారా కోరుకుందామా మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని