దటీజ్‌ సయాంతిక!

మనం ఎనిమిదేళ్ల వయసులో ఏం చేస్తాం?.. ఇంకేం చేస్తాం.. చక్కగా చదువుకుంటాం.. ఎంచక్కా ఆడుకుంటాం.. అంతేగా.. అంతేగా..! కానీ ఓ చిన్నారి మాత్రం ఏకంగా ముఖ్యమంత్రినే కలిసింది.

Updated : 08 Jun 2022 07:07 IST

మనం ఎనిమిదేళ్ల వయసులో ఏం చేస్తాం?.. ఇంకేం చేస్తాం.. చక్కగా చదువుకుంటాం.. ఎంచక్కా ఆడుకుంటాం.. అంతేగా.. అంతేగా..! కానీ ఓ చిన్నారి మాత్రం ఏకంగా ముఖ్యమంత్రినే కలిసింది. ఇంతకీ ఆ నేస్తం ఇదంతా ఎందుకు చేసిందో తెలుసా...?

పశ్చిమబెంగాల్‌కు చెందిన సయాంతిక ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. సయాంతిక ఇటీవల మల్దా జిల్లా మెజిస్ట్రేట్‌కు ఓ లేఖ రాసింది. అందులో తాను కోల్‌కతా వరకు సైకిల్‌పై వెళ్లి ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కలవాలనుకుంటున్నట్లు కోరింది. కన్యాశ్రీ, సభుజ్‌ సాథీలాంటి ప్రభుత్వ పథకాల వల్ల తమ కుటుంబానికి చాలా లబ్ధి చేకూరడమే కారణమని పేర్కొంది. ఈ విషయం మీడియాలో వచ్చింది.

ముఖ్యమంత్రే స్పందించారు..
విషయం తెలుసుకున్న సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఆ చిన్నారి తనను కలిసేందుకు తగిన ఏర్పాట్లు చేయమని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

రమ్మన్నారు కానీ...  
సీఎం తనను కలిసేందుకు సయాంతికకు అనుమతి ఇచ్చారు కానీ... మల్దా నుంచి కోల్‌కతాకు సైకిల్‌పై మాత్రం రావొద్దన్నారు. ప్రభుత్వమే చిన్నారికి, ఆమె తల్లిదండ్రులకు రైల్వేటికెట్లను బుక్‌ చేసింది. ఆ రైల్లోనే తన సైకిల్‌ తెచ్చుకునేలా ఏర్పాట్లూ చేసింది. కోల్‌కతా చేరుకున్న తర్వాత గెస్ట్‌హౌస్‌లో ప్రభుత్వ యంత్రాంగం ఆశ్రయం కల్పించింది. విశ్రాంతి తర్వాత సయాంతిక సైకిల్‌ మీద ముఖ్యమంత్రి నివాసం కాళీఘాట్‌కు చేరుకుంది.

గేట్‌ దగ్గరే...
సీఎం మమతా బెనర్జీ గేట్‌ దగ్గరే నిల్చొని సయాంతికకు ఆహ్వానం పలికారు. తర్వాత చిన్నారిని తనతోపాటు తన నివాసంలోకి తీసుకెళ్లి అరగంటపాటు ముచ్చటించారు. సయాంతిక ముఖ్యమంత్రికి మామిడితాండ్ర, మామిడి మొక్కను బహుమతిగా ఇచ్చింది. ఇంత చిన్న వయసులోనే ఏకంగా ముఖ్యమంత్రితో ముచ్చటించిందంటే ఈ చిన్నారి మామూలుది కాదు కదా.. అందుకే అందరూ ‘దటీజ్‌ సయాంతిక’ అని తెగ పొగుడుతున్నారు. ఎంతైనా సయాంతిక నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని