చిన్నోడు.. ఆలోచనల్లో ఉన్నతుడు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. పట్టుమని పదేళ్లు నిండలేదు.. అయితేనేం.. కుంచె పట్టి అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. అందరితో ఔరా అనిపిస్తున్నాడు.. సేవాభావంలోనూ ఉన్నతుడిగా నిలుస్తున్నాడు.. ఆ నేస్తం

Published : 16 Jun 2022 00:55 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. పట్టుమని పదేళ్లు నిండలేదు.. అయితేనేం.. కుంచె పట్టి అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. అందరితో ఔరా అనిపిస్తున్నాడు.. సేవాభావంలోనూ ఉన్నతుడిగా నిలుస్తున్నాడు.. ఆ నేస్తం వివరాలే ఇవీ..

అమెరికాకు చెందిన ఆండ్రెస్‌ వలెన్సియాకు పదేళ్లు. సాధారణంగా బొమ్మలకూ, పెయింటింగ్‌లకూ పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. అలాగే, ఆండ్రెస్‌కు కూడా ఆరేళ్ల వయసులోనే చిత్రలేఖనంపై ఆసక్తి కలిగింది. అందుకు ఓ డాక్యుమెంటరీనే కారణమని చెబుతున్నాడు.

చిన్నతనంలోనే సెలబ్రిటీ
తాజాగా మియామి నగరంలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ఒకటి జరుగుతోంది. అందులో మన ఆండ్రెస్‌ గీసిన పెయింటిగ్స్‌నూ ప్రదర్శనకు ఉంచారు. అందులోని ఒక పెయింటింగ్‌ను ఈ నెల 21న వేలం వేయనున్నారు. దానికి 50 వేల డాలర్ల వరకూ ధర పలకనుందట. మన కరెన్సీలో దాదాపు రూ.39 లక్షలన్నమాట. వేలం తరవాత గెలుచుకునే మొత్తంలో కొంత డబ్బును ఆసియా వ్యాప్తంగా పేద పిల్లలకు అండగా నిలుస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నాడట. గతేడాది జరిగిన ఎగ్జిబిషన్‌లో ఈ నేస్తం గీసిన బొమ్మలను పెద్ద పెద్ద బిలియనీర్లూ, వ్యాపారవేత్తలూ, సినిమా స్టార్లూ కొనుగోలు చేశారట. దాంతో కొద్దిరోజుల్లోనే ఆండ్రెస్‌ అక్కడ చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయాడు. ఏ పత్రిక చూసినా.. ఏ టీవీ చూసినా ఈ చిన్నోడి ప్రతిభ గురించే చర్చించేవారట. 

రోజుకు కొంత..z
ఏదైనా పెయింటింగ్‌ని ఈ బాలుడు ఒకేసారి పూర్తి చేయడట. కాన్వాస్‌ను డబ్బాలుగా విభజించుకొని, ఒక్కో క్యూబ్‌ వంతున రోజుకు గంటో, రెండు గంటలో గీస్తాడట. మరుసటి రోజు మరికొంత వేస్తాడు. అలా రోజుకు కొంచెం కొంచెంగా పెయింటింగ్‌ను పూర్తి చేయడం ఆండ్రెస్‌ ప్రత్యేకత అని చూసిన వారు పేర్కొంటున్నారు. అలాగనీ, ఆ బొమ్మలు ఏదో సాదాసీదాగా ఉంటాయనుకునేరు ఫ్రెండ్స్‌.. సహజత్వం ఉట్టిపడేలా, చేయి తిరిగిన కళాకారులు గీసినట్లు కనిపిస్తాయవి. చిత్రలేఖనంలో తాను స్ఫూర్తి పొందేవాళ్ల నుంచి అందిన ప్రశంసలు.. ఎప్పటికీ మరిచిపోలేనివని సంతోషపడుతున్నాడీ బాలుడు.

బాధితులకు..
రెండేళ్లలో ఈ బాలుడు గీసిన మొత్తం 32 చిత్రాలతో జూన్‌ 23న ఓ ప్రదర్శన కూడా ఏర్పాటు చేయనున్నాడట. వాటిలో ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో గీసిన పెయింటింగ్‌ కూడా ఉంది. ఆ పెయింటింగ్‌ను వేలం వేసి, వచ్చే మొత్తాన్ని యుద్ధ బాధితుల కోసం పనిచేసే సంస్థలకు ఇవ్వనున్నట్లు ఆండ్రెస్‌ చెబుతున్నాడు. తోటి పిల్లలంతా చదువులూ, ఆటల్లో మునిగిపోతుంటే.. ఈ నేస్తం మాత్రం వారికి భిన్నంగా తన ప్రతిభతో అబ్బురపరుస్తున్నాడు. చిన్న వయసులోనే ప్రతిభతోపాటు మానవత్వంలోనూ ఉన్నతుడిగా నిలుస్తున్న ఆండ్రెస్‌ చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని