డ్రోన్‌తో శత్రువుల ఆటకట్టు!

హాయ్‌ నేస్తాలూ.. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంగతి పేపర్లలోనూ, టీవీల్లోనూ చూసే ఉంటారు. ఉక్రెయిన్‌పైన పట్టు సాధించేందుకు రష్యా తన శక్తియుక్తులన్నింటినీ

Published : 17 Jun 2022 00:59 IST

హాయ్‌ నేస్తాలూ.. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంగతి పేపర్లలోనూ, టీవీల్లోనూ చూసే ఉంటారు. ఉక్రెయిన్‌పైన పట్టు సాధించేందుకు రష్యా తన శక్తియుక్తులన్నింటినీ ధారపోస్తోంది. ఈ క్రమంలో శత్రువుల ఉనికిని పసిగట్టేందుకు ఉక్రెయిన్‌ ప్రభుత్వం ఓ బాలుడి సాయం తీసుకుంది. ఇంతకీ అతనెవరో, చేసిన సాయమేంటో తెలుసుకోండి మరి.

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు సమీపంలోని ఓ పట్టణానికి చెందిన బాలుడు ఆండ్రీ పొక్సాస ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. రష్యా యుద్ధం ప్రారంభించగానే కీవ్‌ నగరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది. ఈ క్రమంలో శత్రుదేశం సైనికుల కదలికలను పసిగట్టేందుకు ఉక్రెయిన్‌ ప్రభుత్వం మన ఆండ్రీ సహాయం కోరింది. అందుకు కారణం.. ఆ బాలుడి దగ్గరున్న డ్రోన్‌.

డ్రోన్‌ సాయంతో లొకేషన్‌
ఆ ప్రాంతంలో ఆండ్రీ వద్ద తప్ప.. డ్రోన్‌ ఎవరి దగ్గరా లేకపోవడంతో ఉక్రెయిన్‌ సైన్యం తనను సంప్రదించింది. దేశం కోసం వెంటనే స్పందించిన ఈ బాలుడు.. తాను నివసిస్తున్న పట్టణానికి రష్యన్‌ సేనలు చేరుకోగానే.. స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసిన తన డ్రోన్‌ను గాల్లోకి ఎగురవేసేవాడు. ఆ డ్రోన్‌ సహాయంతో సైనికులూ, యుద్ధ ట్యాంకులూ ఉన్న ప్రదేశం అక్షాంశాలూ, రేఖాంశాల(లాంగిట్యూడ్‌ అండ్‌ లాటిట్యూడ్‌)ను తన స్మార్ట్‌ఫోన్‌లో నమోదు చేసేవాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆ వివరాలను సోషల్‌ మీడియా సాయంతో ఉక్రెయిన్‌ సైన్యాధికారులకు పంపేవాడు. వారి ఆదేశాలతో బలగాలు.. అక్కడి నుంచే రష్యన్‌ సైనికులు ఉన్న ప్రాంతాన్ని టార్గెట్‌ చేసి.. ఆధునిక బాంబర్లను ప్రయోగించేవి. అలా సాధ్యమైనంత వరకూ శత్రుదేశ సైనికుల జాడను కచ్చితంగా గుర్తించి.. వారి మీద బాంబులు వేయడం ప్రారంభించారు. దీనంతటికీ మన ఆండ్రీ పంపే.. లొకేషన్‌ వివరాలే కీలకం.

తండ్రి సహకారం..
ఉక్రెయిన్‌ సైన్యానికి సమాచారం అందించేందుకు ఆండ్రీతోపాటు అతడి తండ్రి స్టానిస్లావ్‌ కూడా ముందుకొచ్చారు. ఈ తండ్రీ కొడుకులిద్దరూ కలిసి రాజధాని నగరం కీవ్‌కు చేరుకునే ప్రధాన రహదారి మీదుగా చొచ్చుకొస్తున్న రష్యా సేనలనూ, చమురు ట్యాంకర్లనూ, ఫిరంగులనూ ధ్వంసం చేశారట. ‘మేమిద్దరం కలిసి ఎంతమంది శత్రు సైనికులకు మట్టుబెట్టామో, ఎన్ని ట్యాంకులను నాశనం చేశామో.. కచ్చితంగా తెలియదు కానీ రాజధాని నగరం ఆక్రమణకు గురికాకుండా చేతనైన సాయం చేయగలిగాం. ఎవరికీ లభించని అవకాశం మాకు దక్కడం గర్వంగా ఉంది’ అని ఆండ్రీ తండ్రి చెబుతున్నారు. కష్టసమయంలో దేశ రక్షణలో భాగమయ్యే అవకాశం రావడం నిజంగా గ్రేట్‌ కదూ.. అందుకే, ఆండ్రీతోపాటు అతడి తండ్రికీ మనం సెల్యూట్‌ చేయాల్సిందే..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని