శెభాష్‌ దేవక్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. సరిగ్గా ఆరేళ్లు కూడా నిండలేదు.. అయితేనేం, పట్టుదలతో సాధన చేశాడు.. రెండేళ్లలోనే గుర్రపు స్వారీలో పట్టు సంపాదించాడు.. అంతేకాదు.. అవార్డూ పట్టేశాడు.. అందరితో ఔరా

Published : 22 Jun 2022 01:02 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. సరిగ్గా ఆరేళ్లు కూడా నిండలేదు.. అయితేనేం, పట్టుదలతో సాధన చేశాడు.. రెండేళ్లలోనే గుర్రపు స్వారీలో పట్టు సంపాదించాడు.. అంతేకాదు.. అవార్డూ పట్టేశాడు.. అందరితో ఔరా అనిపిస్తున్నాడు.. ఆ బుడతడి వివరాలే ఇవీ..

లాక్‌డౌన్‌ సమయంలో బడులు లేకపోవడంతో మనమంతా ఇంటికే పరిమితమయ్యాం. ఏదో కాలక్షేపం చేస్తూ గడిపేశారు చాలామంది. కానీ, కేరళ రాష్ట్రంలోని నీలేశ్వరం ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలుడు దేవక్‌ మాత్రం ఆ సమయాన్ని వృథా చేయలేదు. పట్టుదలతో గుర్రపు స్వారీని నేర్చుకోవడమే కాకుండా ‘వండర్‌ కిడ్‌’ విభాగంలో యూనివర్సల్‌ రికార్డు ఫోరం అందించే గ్లోబల్‌ అవార్డునూ దక్కించుకున్నాడు.

సరదాగా ప్రారంభించి...
దేవక్‌ తల్లిదండ్రులకు మున్నార్‌లో ఓ రిసార్టు ఉంది. కొవిడ్‌ సమయంలో ఆ కుటుంబమంతా ఆ రిసార్టులోనే సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంది. ఆ సమయంలో సందర్శకుల స్వారీ కోసం అక్కడుంచిన ‘కర్ణన్‌’ అనే గుర్రంపైన విహరించాలని దేవక్‌కి ఆసక్తి కలిగింది. ఇంకేం.. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారూ సరేనన్నారు. దాంతో నాలుగున్నర సంవత్సరాలకే గుర్రపు స్వారీ చేయడం ప్రారంభించాడు. సరదాగా మొదలైన ఆ ఆసక్తే.. క్రమంగా అతడికి ఇష్టంగా మారింది.

శిక్షకుడి సాయంతో..
కొవిడ్‌ కేసులు తగ్గిపోయాక, ఆ కుటుంబమంతా వారింటికి తిరిగి వెళ్లిపోయింది. అక్కడ కూడా ఈ నేస్తం ఆలోచనలన్నీ గుర్రపు స్వారీ మీదే ఉండసాగాయి. దాంతో.. నేర్చుకుంటానని తండ్రిని అడిగాడు. కొడుకు పట్టుదలను చూసి ముచ్చటపడిన ఆయన.. బెంగళూరు నుంచి ఓ గుర్రాన్ని తెప్పించారు. దానికి ‘రాణి’ అని పేరు కూడా పెట్టారు. అంతేకాదు.. ప్రత్యేకంగా ఓ శిక్షకుడిని నియమించి మరీ, కొడుక్కి శిక్షణ ఇప్పించారాయన. అలా కొద్దిరోజుల్లోనే గుర్రపు స్వారీపైన పట్టు సాధించాడు దేవక్‌. ఎంతలా అంటే, ఏడాదిన్నర కాలంలోనే విపరీతమైన రద్దీగా ఉండే జాతీయ రహదారిపైన సొంతంగా అయిదు కిలోమీటర్లు స్వారీ చేసేంతగా!

గుర్రంపైనే పాఠశాలకు..
మనమంతా ఆటోలోనో, బస్సులోనో, బైక్‌ మీదనో లేదంటే సైకిల్‌ మీదనో బడికి వెళ్లి వస్తుంటాం. కానీ, మన దేవక్‌ మాత్రం అందరికీ భిన్నంగా గుర్రంపైనే పాఠశాలకు వెళ్తాడట. రోజూ వెళ్లివచ్చేటప్పుడు అందరూ అతడిని చూసి ఆశ్చర్యపోతున్నారట. ఆ ఫొటోలూ, వీడియోలూ ఇటీవల సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారడంతో ఈ నేస్తం కొద్దిరోజుల్లోనే చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయాడు. ఇటీవల వచ్చిన అవార్డుతో ఈ చిన్నోడి క్రేజ్‌ మరింతగా పెరిగిపోయింది. ‘పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తే.. అద్భుతాలు సృష్టించగలరు’ అని దేవక్‌ తండ్రి చెబుతున్నాడు. గుర్రం మీద ఈ నేస్తాన్ని చూస్తుంటే ‘వావ్‌’ అనిపిస్తోంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని