కిలకిల క్రిష్‌... ఎంతో భేష్‌!

వయసు కేవలం 12 సంవత్సరాలు.. కానీ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. అదీ ఆషామాషీగా కాదు... ఏకంగా 5,045 మందితో పోటీపడి! ఇంతకీ ఎవరా చిరుతలాంటి బుడత.. ఏం చేశాడో

Published : 23 Jun 2022 00:39 IST

వయసు కేవలం 12 సంవత్సరాలు.. కానీ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. అదీ ఆషామాషీగా కాదు... ఏకంగా 5,045 మందితో పోటీపడి! ఇంతకీ ఎవరా చిరుతలాంటి బుడత.. ఏం చేశాడో తెలుసుకోవాలని ఉందా?

కర్ణాటకకు చెందిన క్రిష్‌ ఆనంద్‌. ఆర్నిథాలజీలో నేషనల్‌ పోగ్రామ్‌ ఆన్‌ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌ (ఎన్‌పీటీఈఎల్‌)లో కోర్సు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డూ సాధించాడు. మొత్తం 5,045 మంది నమోదు చేసుకుంటే, అందులో కేవలం 372 మంది మాత్రమే ఈ కోర్సు పూర్తి చేశారు. అందులో మన క్రిష్‌ ఒక్కడు.

పక్షులంటే ప్రాణం..
ఈ కోర్సులో పక్షుల సైకాలజీ, ప్రవర్తన, శరీర నిర్మాణం, వర్గీకరణ, పరిక్షణ తదితర విభాగాలుంటాయి. మన క్రిష్‌కు చిన్నప్పటి నుంచే పక్షులంటే చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా చెట్లపై సేదతీరే పక్షులను గమనిస్తుండేవాడు. అవి ఎలా ఎగురుతున్నాయి. ఏమి తింటున్నాయి.. ఎలా అరుస్తున్నాయి.. తోటి పక్షులతో ఎలా ప్రవర్తిస్తున్నాయి.. ఎలా గూడు కట్టుకుంటున్నాయి.. ఎలాంటి గూడు కట్టుకుంటున్నాయి.. ఇలాంటి వివరాలన్నీ పరిశీలించి అమ్మానాన్నతో పంచుకునేవాడు. తర్వాత వాళ్ల నాన్నను అడిగి ఓ పాత కెమెరాతో పక్షులను తెగ ఫొటోలు తీసేవాడు.

నాన్న పోత్సాహం...
ఇలా చిన్నతనం నుంచే పక్షుల మీద తెగ ఆసక్తి చూపిన మన క్రిష్‌ను వాళ్ల నాన్న శశిధర్‌ చాలా ప్రోత్సహించారు. ఆయన వైల్డ్‌ లైఫ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాలో సభ్యుడు. పక్షులంటే క్రిష్‌కున్న ఇష్టాన్ని గమనించిన ఆయన ఎంతో చేయూతనిచ్చారు. ప్రస్తుతం మన క్రిష్‌ పక్షుల కోసం మరింత సమయం వెచ్చిస్తున్నాడు. పక్షులు గూడు కట్టుకోవడం, గుడ్లు పెట్టడం, వాటిని పొదగడం, పిల్లల్ని సంరక్షించడం మీద డాక్యుమెంటరీలు తీసే పనిమీద ఉన్నాడు. ఇంత చిన్న వయసులోనే పక్షుల మీద అంత పరిశోధన చేస్తున్న మన క్రిష్‌ నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు