అబ్బురపరుస్తున్న అభినవ్‌!

ఆ బుజ్జాయి పేరు అభినవ్‌ సాయి. వయసు 19 నెలలు. ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్న సామెత ఈ బుడతడి విషయంలో అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎందుకంటే.. సాయి తన తెలివితేటలతో అప్పుడే ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సాధించాడు.

Published : 26 Jun 2022 01:48 IST

బుడిబుడి అడుగుల బుడత..
మాటలు కూడా సరిగా రాని చిరుత..
తెలివితేటల్లో అద్భుత ఘనత..
నెలలప్రాయంలోనే రికార్డులు కొల్లగొడుతున్న బుజ్జి విజేత..
ఇంతకీ ఆ చిన్నారి ఎవరు?
ఏం సాధించాడో తెలుసా!

ఆ బుజ్జాయి పేరు అభినవ్‌ సాయి. వయసు 19 నెలలు. ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్న సామెత ఈ బుడతడి విషయంలో అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎందుకంటే.. సాయి తన తెలివితేటలతో అప్పుడే ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సాధించాడు.

అమ్మానాన్నే అవాక్కయ్యారు!

కాకినాడకు చెందిన ఉమాశంకర్‌, లలితా మైథిలి ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉంటున్నారు. వీరికి 2020 అక్టోబర్‌ 19న అభినవ్‌ సాయి, ఆస్ట్రేలియాలోనే జన్మించాడు. కొన్ని నెలల తర్వాత పిల్లాడి ఆలనాపాలనా చూసే సమయంలో.. ఏవైనా బొమ్మలు చూపించి, అదెక్కడ అంటే వెంటనే దాన్ని తీసుకువచ్చి చూపించేవాడు. దీంతో పిల్లాడు మిగతావాళ్లతో పోల్చుకుంటే చురుకని అమ్మానాన్న గ్రహించారు. అభినవ్‌ సాయికి పలు దేశాల జాతీయ పతాకాలు, స్వాతంత్య్ర సమరయోధులు, జంతువులు, పండ్లు, పూలు, కూరగాయలు, పలు గుర్తులున్న కార్డులను చూపించి అవగాహన కల్పించారు. సాయి వాటన్నింటినీ చాలా తక్కువ సమయంలోనే నేర్చేసుకున్నాడు. ఏ దేశ జాతీయ పతాకాన్ని అడిగినా.. చటుక్కున చూపించడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.

తాత చూపిన దారి...

ఆస్ట్రేలియా నుంచి కాకినాడకు వచ్చిన తరవాత తమ మనవడి ప్రతిభను తాత వీఎస్‌ఆర్‌ మూర్తి గమనించారు. ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వారు అభినవ్‌ సాయి తెలివి తేటలను పరిశీలించారు. వాళ్లు పరీక్షించే సమయంలో అభినవ్‌ 142 కార్డులను గుర్తించగా, ప్రస్తుతం 252 కార్డుల వరకు గుర్తించడం విశేషం. మొబైల్‌ ఫోన్‌ వాడకుండా ఉండాలని, సరదాగా తల్లిదండ్రులు కార్డులను ఇచ్చి వాటిని గుర్తించమంటే ఇలా రికార్డులు కొట్టేశాడీ బుడతడు. ఇంకా మాటలు కూడా సరిగ్గా రాని ఈ చిన్నారి తెలివితేటలకు ముగ్ధులైన ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు ధ్రువపత్రంతోపాటు పతకం, పెన్ను, గుర్తింపు కార్డులను అందించారు. ఈ బుజ్జాయి ఘనతకు అంతా ఫిదా అయిపోతున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

- శ్రీనివాసు కొరిపెల్ల, న్యూస్‌టుడే, గాంధీనగర్‌ (కాకినాడ)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని