అయిదేళ్లకే పుస్తకం రాసేసింది!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఆ చిన్నారి వయసు అయిదేళ్లు.. అయితేనేం, ఊహాశక్తితో అబ్బురపరుస్తోంది.. పిల్లలను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరని నిరూపిస్తోంది.. ఇటీవల ఏకంగా ఓ పుస్తకమే

Published : 02 Jul 2022 01:09 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఆ చిన్నారి వయసు అయిదేళ్లు.. అయితేనేం, ఊహాశక్తితో అబ్బురపరుస్తోంది.. పిల్లలను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరని నిరూపిస్తోంది.. ఇటీవల ఏకంగా ఓ పుస్తకమే రాసింది.. గిన్నిస్‌ రికార్డూ సాధించేసింది.. ఇంతకీ ఆ నేస్తం ఎవరో, ఆ వివరాలేంటో చదివేయండి మరి..

యూకేలోని వేమౌత్‌ అనే ప్రాంతానికి చెందిన బెల్లా జె డార్క్‌.. మూడేళ్ల వయసు నుంచే చిన్న చిన్న కథలు రాసేది. మాటలే సరిగ్గా రాని ఆ వయసులోనే కూతురి ప్రతిభ, ఊహాశక్తిని చూసి.. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారట. అలా పసివయసు నుంచే బెల్లాకు రచనలంటే క్రమంగా ఆసక్తి ఏర్పడింది. ఆ ఇష్టమే.. ఇటీవల ఓ పుస్తకం రాసే వరకూ వెళ్లింది. ప్రస్తుతం అయిదేళ్ల వయసున్న ఈ నేస్తం ‘ది లాస్ట్‌ క్యాట్‌’ పేరిట రాసిన పుస్తకం వెయ్యికి పైగా కాపీలు అమ్ముడుపోయింది. దాంతో ‘ప్రపంచంలోనే అతి చిన్న వయసు రచయిత్రి’గా గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కేసింది.

బొమ్మ నుంచి ఆలోచన..
చిన్నప్పటి నుంచే బెల్లాకు బొమ్మలు గీయడం అలవాటు. అలా ఒకరోజు ఓ పిల్లి బొమ్మ వేస్తుండగా.. ఆ అంశంపైన ఓ కథ రాయాలనే ఆలోచన వచ్చిందట. వెంటనే ఆ విషయాన్ని తండ్రికి చెప్పడంతో, ఆయన సరేనంటూ ప్రోత్సహించారు. దాంతో.. చీకట్లో బయటకు వెళ్లిన పిల్లి తప్పిపోయిన కథాంశంతో, కేవలం 32 రోజుల్లోనే ‘ది లాస్ట్‌ క్యాట్‌’ అనే పుస్తకం రాసిందీ చిన్నారి. అంతేకాదు.. ఆ కథలోని సంఘటనలకు తగినట్లుగా తానే బొమ్మలనూ గీసింది. ఈ పుస్తకాన్ని ఓ సంస్థ పబ్లిష్‌ చేయడంతోపాటు ఇటీవల వాటి అమ్మకాలు వెయ్యి దాటడంతో అధికారికంగా గిన్నిస్‌ బుక్‌లోకి చేరిన ఘనతను దక్కించుకుందీ పాప.

ఒంటరిగా వెళ్లొద్దని..
తను రాసిన పుస్తకం ద్వారా తోటి పిల్లలందరికీ ఓ విషయం చెప్పాలనుకుంది బెల్లా. అదేంటంటే.. తన కథలో రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లిన పిల్లి తప్పిపోతుంది. ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే, రాత్రి సమయాల్లో పిల్లలు ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సలహా ఇస్తోంది. పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరని నిరూపిస్తున్న ఈ నేస్తం త్వరలోనే ‘ది లాస్ట్‌ క్యాట్‌ 2’ రాయనుందట. ఇప్పటికే దానికి అవసరమైన కసరత్తు కూడా పూర్తి చేసేసింది. ఇప్పటివరకూ ‘అతి పిన్న వయసు రచయిత్రి’గా గిన్నిస్‌ రికార్డు డొరోతీ అనే మహిళ పేరిట ఉండేది. ఆమె తన ఆరేళ్ల వయసులో ఈ ఘనత సాధించింది. అయితే, శ్రీలంకకు చెందిన థానువానా సెరసింఘే అనే బాలుడు నాలుగేళ్ల వయసులోనే పుస్తకం రాసి ‘ప్రపంచంలోనే అతి చిన్న వయసు రచయిత’గా నిలిచాడు. ఈ బాలుడు, 2017లో ఆ రికార్డు సాధించాడు. మన బెల్లా మాత్రం.. భవిష్యత్తులో గొప్ప రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలని కష్టపడుతోంది. ఈ చిన్నారికి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని