నాన్న కష్టం చూడలేక...

ఆ నేస్తం చదివేది పదో తరగతి.. వయసేమో పదిహేనేళ్లు.. కానీ, ఏకంగా ఓ ఆప్‌నే తయారు చేసింది. అదీ అన్నదాతల కోసం.. ఇంతకీ ఆ బాలిక ఎవరు.. తాను రూపొందించిన ఆప్‌ రైతులకు ఎలా

Updated : 08 Jul 2022 06:49 IST

ఆ నేస్తం చదివేది పదో తరగతి.. వయసేమో పదిహేనేళ్లు.. కానీ, ఏకంగా ఓ ఆప్‌నే తయారు చేసింది. అదీ అన్నదాతల కోసం.. ఇంతకీ ఆ బాలిక ఎవరు.. తాను రూపొందించిన ఆప్‌ రైతులకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసా..!

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లలిత్‌పూర్‌కు చెందిన నందిని కుష్వా ప్రస్తుతం అక్కడి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమెది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం. వాళ్ల నాన్న చాలా సంవత్సరాలుగా వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. కానీ ఏటా ఎన్నో ఇబ్బందులు. సరైన దిగుబడులు రాక ఎప్పుడూ నష్టాలే. నేలసారం మీద అవగాహన లేకుండా సాగు చేయడటమే దీనికి కారణం అని గుర్తించింది.

అధ్యయనం చేసి మరీ..
నందిని వెంటనే నేలసారం మీద అధ్యయనం చేసింది. ఆ వివరాలతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పనిచేసే ఓ ఆప్‌ను రూపొందించింది. దానికి ‘మిట్టీ కో జానో, ఫసల్‌ పహచానో’ అని నామకరణం చేసింది. దీని సాయంతో నేల సారం ఆధారంగా ఏ పంటలు వేయొచ్చో తెలుసుకోవచ్చు. ఈ ఆప్‌ సహకారంతో నేలలోని నత్రజని, ఫాస్పరస్‌, పొటాషియం పరిమాణం.. ఉష్ణోగ్రతలు, తేమ, వర్షపాతం ఇలాంటి వివరాలను సంగ్రహించి విశ్లేషించవచ్చు. ఈ సమాచారం ఆధారంగా ఏఏ పంటలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇది నిజంగా రైతన్నలకు ఎంతో ఉపయోగకరం.

ప్రధాని ప్రశంస
ఇటీవల గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రారంభమైన ‘డిజిటల్‌ ఇండియా వీక్‌’లో నందిని పాల్గొంది. మన ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈమెను ఎంతగానో మెచ్చుకున్నారు. రైతుల కోసం రూపొందించిన ఆప్‌ వివరాలు తెలుసుకొని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదించారు.

ఉపాధ్యాయుడి ప్రోత్సాహం
నందిని తన గణిత ఉపాధ్యాయుడైన ప్రకాశ్‌ మిశ్రా సహకారం, ప్రోత్సాహంతో ‘రెస్పాన్సిబుల్‌ ఏఐ ఫర్‌ యూత్‌’ ఛాలెంజ్‌లో పాల్గొంది. కేంద్రమంత్రి చేతుల మీదుగా అవార్డును సైతం గెలుచుకుంది. తాను భవిష్యత్తులో అగ్రికల్చర్‌ ఇంజినీర్‌ కావాలనుకుంటోంది. మరి మనందరం ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని