చదివే అలవాటే.. రచయితగా మార్చింది!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. స్కూల్‌లో టీచర్లు మనల్ని ఓ వ్యాసం రాసుకొని రమ్మంటేనే, గందరగోళానికి గురవుతాం. ఇంటికెళ్లి పెద్దవాళ్ల సాయంతోనో, మిత్రులతో కలిసో.. ఏదో ఒకటి రాసేసి అయ్యిందనిపిస్తాం.

Published : 09 Jul 2022 00:57 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. స్కూల్‌లో టీచర్లు మనల్ని ఓ వ్యాసం రాసుకొని రమ్మంటేనే, గందరగోళానికి గురవుతాం. ఇంటికెళ్లి పెద్దవాళ్ల సాయంతోనో, మిత్రులతో కలిసో.. ఏదో ఒకటి రాసేసి అయ్యిందనిపిస్తాం. కానీ, ఓ నేస్తం మాత్రం ఏకంగా పుస్తకాలే రాసేస్తోంది. అంతేకాదు.. గిన్నిస్‌ రికార్డు కూడా సాధించింది. ఇంతకీ తనెవరో, ఆ వివరాలేంటో తెలుసుకోండి మరి.

సౌదీ అరేబియాకు చెందిన రితాజ్‌ హుస్సేన్‌ అల్హాజ్మీకి ప్రస్తుతం పదమూడు సంవత్సరాలు. ఇప్పటివరకూ మూడు పుస్తకాలు రాసిన తాను.. ‘బుక్‌ సిరీస్‌ రాసిన అతి చిన్న వయసు రచయిత్రి’గా ఇటీవలే ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్ట్స్‌’లోకి ఎక్కేసింది.

ఆరేళ్ల నుంచే..
రితాజ్‌కు ఆరేళ్ల వయసున్నప్పటి నుంచే చదవడం అలవాటుగా మారింది. అలా పుస్తకాలు చదువుతూ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్న చిన్న కథలు రాయడం ప్రారంభించింది. ఏడేళ్ల వయసులోనే సౌదీ అరేబియాలోని పెద్ద పెద్ద లైబ్రరీలకు వెళ్తూ.. అక్కడి పుస్తకాలను తిరగేస్తుండేది. అలా 2019లో ‘ట్రెజర్‌ ఆఫ్‌ ద లాస్ట్‌ సీ’ పేరిట తొలి పుస్తకాన్ని ఆంగ్లంలో రచించింది. అదే సంవత్సరంలో ‘పోర్టల్‌ ఆఫ్‌ ద హిడెన్‌ వరల్డ్‌’ అనే మరో పుస్తకాన్నీ పూర్తి చేసింది. ఈ రెండు బుక్స్‌నూ ఓ ప్రముఖ సంస్థ పబ్లిష్‌ చేసి మార్కెట్లోకి తీసుకువచ్చింది. దాంతో గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు ఆమె పేరును పరిగణనలోకి తీసుకున్నారు. అన్ని పరిశీలనల తరవాత ఇటీవలే ‘బుక్‌ సిరీస్‌ ప్రచురించిన అతి పిన్న వయస్కురాలి’గా ధ్రువీకరణ పత్రం అందజేశారు.

ఊహాజనిత పాత్రలతో..
తన బుక్‌ సిరీస్‌లో భాగంగా 2020లో ‘బియాండ్‌ ద ఫ్యూచర్‌ వరల్డ్‌’ పేరిట మూడో పుస్తకాన్ని విడుదల చేసింది రితాజ్‌. తన రచనలన్నీ ఊహాజనిత పాత్రల చుట్టూ తిరుగుతుంటాయి. చిన్నారుల్లో ఆలోచన శక్తితోపాటు సృజనాత్మకతను పెంపొందించాలనే ఉద్దేశంతో కల్పిత కథలపైనే దృష్టిసారిస్తున్నానని చెబుతుందీ బాలిక. ప్రస్తుతం ‘ద ప్యాసెజ్‌ టు ద అన్‌నౌన్‌’ పేరిట నాలుగో పుస్తకాన్ని సిద్ధం చేస్తోంది. పిల్లలు తమ కలలను సాకారం చేసుకునేందుకు ఇది దోహదం చేస్తుందట.

జపనీస్‌ నేర్చుకుంటూ..
ప్రఖ్యాత ‘హ్యారీ పోటర్‌’ సిరీస్‌ రచయిత జె.కె.రౌలింగ్‌ తనకు స్ఫూర్తి అని రితాజ్‌ చెబుతోంది. ఇతర రచయితలు నిర్వహించే వర్క్‌షాప్‌లకు తరచూ వెళ్తుంటాననీ, తన నైపుణ్యాలు మెరుగుపరచుకొనేందుకు అవి ఎంతగానో సహకరిస్తున్నాయని ఈ నేస్తం పేర్కొంటుంది. ఆంగ్లంతోపాటు అరబిక్‌ తెలిసిన తను.. ప్రస్తుతం జపనీస్‌ భాష నేర్చుకుంటోందట. ‘గిన్నిస్‌ రికార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. యువ రచయితలకు అవసరమైన మార్గనిర్దేశనం చేయడమే కాకుండా జీవితంలో ఎదురయ్యే అవరోధాలను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని వారిలో నింపే ప్రయత్నం చేస్తా’నని చెబుతోందీ నేస్తం. ఇంత చిన్న వయసులో పుస్తకాలు రాయడమే ఓ సవాలు అనుకుంటే.. వాటికి ప్రపంచ రికార్డూ సాధించిన మన రితాజ్‌ చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని