Updated : 11 Jul 2022 06:48 IST

పర్వతాలు ఎక్కేస్తూ.. లక్ష్యాన్ని సాధిస్తూ..

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ప్రస్తుతం మనలాంటి పిల్లలంతా సెల్‌ఫోన్‌లో ఆటలూ, సినిమాలూ, వెబ్‌ సిరీస్‌లూ అంటూ.. చదువు కంటే ఎక్కువగా వాటి చుట్టే తిరుగుతున్నారు కదా! అయితే, ఓ అక్క మాత్రం సరదాలన్నీ పక్కనబెట్టేసి.. తాను అనుకున్న లక్ష్యం వైపు ఒక్కో మెట్టు ఎక్కేస్తోంది. ఆ నేస్తం ఎవరో, ఏం సాధించిందో చదివేయండి మరి.

మహారాష్ట్రలోని ముంబయికి చెందిన కామ్యా కార్తికేయన్‌.. ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. గత నెలలో ఉత్తర అమెరికాలోని 20,310 అడుగుల ఎత్తైన ‘మౌంట్‌ దెనాలి’ పర్వత శిఖరాన్ని అధిరోహించింది. అంతేకాదు, మన దేశం నుంచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది.

మూడేళ్ల నుంచే ఆసక్తి
కామ్యా వాళ్ల నాన్న నేవీ కమాండర్‌ కావడంతో చిన్నప్పటి నుంచే తనకు వ్యాయామం, క్రమశిక్షణ అలవడింది. అలా మూడేళ్ల వయసులోనే ట్రెక్కింగ్‌ చేయడం ప్రారంభించింది. ఆ సమయంలోనే పుణెకి దగ్గరలోని లోనావాలా ట్రాక్‌నూ చుట్టేసింది. తొమ్మిది సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో కలిసి హిమాలయాల పర్వత సానువుల్లోని పలు ఎత్తైన శిఖరాలను అధిరోహించింది. మరుసటి ఏడాదే 5346 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌నూ చేరుకుంది. 2019లో లద్దాఖ్‌లోని 6260 మీటర్ల కాంగ్రీ పర్వతాన్ని ఎక్కేసింది. ఏటా రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్న ఈ బాలికకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఏడు ఖండాల్లోని..
ఏడు ఖండాల్లోని అతి ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనేది కామ్యా లక్ష్యమట. ఇందులో భాగంగా ఇప్పటికే అయిదు ఖండాల్లోని శిఖరాలను చేరుకుంది. మిగతా రెండింటితోపాటు ఉత్తర, దక్షిణ ధ్రువాలనూ చుట్టేయాలని చూస్తోంది. ఇదే స్ఫూర్తితో మిగతా రెండు ఖండాల్లోని పర్వతాలను అధిరోహిస్తే.. అలా చేసిన అతి చిన్న వయస్కురాలిగా కామ్యా రికార్డుల్లో నిలిచిపోతుందని వాళ్ల నాన్న చెబుతున్నారు. తాజాగా మౌంట్‌ దెనాలి పర్వతాన్ని ఎక్కి, అక్కడి శిఖరాగ్రం మీద మువ్వన్నెల జెండాను ఎగరేసిందీ బాలిక. పర్వతారోహణ పైన కామ్యాకున్న ఆసక్తినీ, ఇప్పటివరకూ చూపిన ప్రతిభను దృష్టిలో ఉంచుకొని.. గతేడాది ప్రధానమంత్రి బాల పురస్కారం అందుకుంది. ఇదే ఆత్మవిశ్వాసంతో ఈ అక్క భవిష్యత్తులో మరింత మంచి పేరు సాధించాలని మనమూ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts