Published : 12 Jul 2022 01:26 IST

లోపాన్ని జయించాడు.. లోకాన్ని మెప్పించాడు!

చక్రాల కుర్చీ వెక్కిరించినా.. కాళ్లు సహకరించకున్నా... అందరిలా తాను లేకున్నా... తన ఆశయం ఆగలేదు.. అంకితభావమూ తగ్గలేదు... మొత్తానికి అనుకున్నది సాధించాడు.. లక్ష్యాన్ని చేరుకున్నాడు.. మనలాంటి చిన్నారులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంతకీ ఆ బాలుడు ఎవరంటే...

తమిళనాడు రాష్ట్రం విల్లుపురానికి చెందిన ఎస్‌.గోకుల కృష్ణన్‌కు 14 సంవత్సరాలు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయిదు సంవత్సరాల వయసులోనే పోలియో బారినపడ్డాడు. దీంతో రెండు కాళ్లూ చచ్చుబడి పోయాయి. అప్పటి నుంచి వీల్‌చైర్‌కే పరిమితమయ్యాడు. ఇటీవల నిర్వహించిన నేషనల్‌ మీన్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ (ఎన్‌.ఎమ్‌.ఎమ్‌.ఎస్‌) పరీక్షలో తన సత్తా చాటాడు. విల్లుపురం నుంచి కేవలం 52 మంది మాత్రమే ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అందులో మన గోకుల కృష్ణన్‌ ఒకరు.

ఆరో తరగతి నుంచే...

ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆరో తరగతి నుంచే ఎన్‌.ఎమ్‌.ఎమ్‌.ఎస్‌. కోసం సన్నద్ధమవుతున్నాడు. ఎట్టకేలకు ప్రస్తుతం తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. దీంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

‘మేం గర్విస్తున్నాం’..

గోకుల కృష్ణన్‌ ఈ ఘనత సాధించినందుకు, గణిత ఉపాధ్యాయుడు కె.రామ్‌కుమార్‌ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘గోకుల కృష్ణన్‌ పాఠశాలలో నిర్వహించే వ్యాసరచన, వక్తృత్వ పోటీలకు హాజరయ్యేవాడు. ప్రస్తుతం ఈ ఘనత సాధించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత అవడం ద్వారా తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు నెలకు వెయ్యి చొప్పున మొత్తంగా దాదాపు రూ.48,000 వరకు ఉపకారవేతనం వస్తుంది. ఇది ఆ బాలుడికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉన్నత విద్యలో గోకులకృష్ణన్‌కు మా ఉపాధ్యాయుల సహకారమూ ఎప్పుడూ ఉంటుంది’ అంటున్నారు.

‘నాకెప్పుడూ బాధలేదు’

‘నేను అందరిలా లేనందుకు బాధ లేదు. చక్రాల కుర్చీకే పరిమితమైనందుకూ దుఃఖం లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నా. నాకు భవిష్యత్తులో డాక్టర్‌ కావాలని ఉంది. ‘నీట్‌’ కోసమూ సన్నద్ధమవుతున్నా. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. నా పూర్తి శక్తి, సామర్థ్యాలను చదువు కోసమే వెచ్చిస్తున్నా’ అంటున్నాడు గోకులకృష్ణన్‌. ఎంతైనా ఈ నేస్తం చాలా గ్రేట్‌ కదూ! మరింకేం.. మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా మరి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని