Updated : 16 Jul 2022 03:54 IST

పుస్తకాలు రాసి.. రికార్డు సాధించి..

హలో ఫ్రెండ్స్‌.. తన వయసు పిల్లలంతా ఆటలూ, విహారయాత్రలూ అంటూ సరదాగా గడిపేస్తుంటే.. ఓ నేస్తం మాత్రం పుస్తకాలతో కుస్తీ పడుతోంది. పుస్తక పఠనం పైనున్న ఆ ఆసక్తే క్రమక్రమంగా తనను రచయితగా మార్చింది. ఇంతకీ ఆ నేస్తం ఎవరో, ఆ వివరాలేంటో తెలుసుకోండి మరి..

కేరళ రాష్ట్రంలోని కోచికి చెందిన సన సజన్‌కు ప్రస్తుతం 14 సంవత్సరాలు. పాఠశాలలో చెప్పే నోట్స్‌, పరీక్షలు రాయడమే ఓ ఛాలెంజ్‌లా తీసుకొనే ఈ వయసులో.. ఏకంగా రెండు పుస్తకాలు రాసి ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోకి ఎక్కేసింది.

బొమ్మల కంటే పుస్తకాలతోనే..
చిన్నతనం నుంచే సన.. బొమ్మలు, ఆట వస్తువుల కంటే పుస్తకాలతోనే ఎక్కువ సమయం గడిపేది. అయిదేళ్లకే కామిక్‌ పుస్తకాలు చదవడం ప్రారంభించింది. ఈ అలవాటే ఎనిమిదేళ్లకు మలయాళంతోపాటు ఆంగ్ల పుస్తకాలు చదివేలా చేసింది. ఆ ఆసక్తి కాస్త పుస్తకాలు రాసేంత ఇష్టంగా మారింది. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో పదకొండేళ్ల వయసులో కల్పిత పాత్రలతో ఓ నవలను రాయడం మొదలుపెట్టింది. అలా రెండేళ్లు కష్టపడి 277 పేజీలతో తొలి పుస్తకానికి తుది రూపు తీసుకొచ్చింది. మరుసటి ఏడాదిలోనే మొదటి దానికి కొనసాగింపుగా మరో పుస్తకాన్ని రచించింది. కరోనా కారణంగా వాటిని పబ్లిష్‌ చేయడం కాస్త ఆలస్యమైంది. ఇటీవల ఓ ప్రముఖ సంస్థ ఆ రెండింటినీ ప్రచురించడంతో ప్రపంచంలోనే ‘అతి పిన్న వయసు ఫాంటసీ రైటర్‌’గా ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ ప్రతినిధులు గుర్తించారు. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు బుక్స్‌ ఉన్నాయనీ, ప్రస్తుతం మూడోది సిద్ధం చేస్తున్నట్లు చెబుతోందీ నేస్తం.

పదాల వాడకం తెలిసింది..
తన ప్రయాణంలో ఎదురయ్యే అవరోధాలను దాటుకుంటూ, చుట్టూ ఉండే ప్రజలను కాపాడే క్లెటా అనే ఓ పదకొండేళ్ల బాలిక కల్పిత పాత్ర చుట్టూనే సన రచనలు సాగాయి. ‘నాకే అద్భుత శక్తులు ఉంటే ఏం చేసేదాన్నో’ అని ఊహించుకొని కథనాన్ని ఆసక్తికరంగా మలిచిందట.

చిన్నతనం నుంచే పుస్తకాలు చదివే అలవాటు ఉండటం తనకు అన్ని విధాలుగా కలిసొచ్చింది. వాక్య నిర్మాణంతోపాటు ఏ పదాలను ఎక్కడ ఉపయోగించాలో బాగా తెలిసిందట. ఈ నేస్తం మాతృభాష మలయాళమే అయినా, రచనలు మాత్రం ఆంగ్లంలోనే చేస్తోంది. భవిష్యత్తులో తన మాతృభాషలోనూ పుస్తకాలు రాస్తానంటోంది. ఇటీవల సాధించిన రికార్డు తనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందనీ, బాల రచయితలతోపాటు యువతలో స్ఫూర్తి నింపేందుకు కృషి చేస్తానంటోంది. ముందు ముందు మరిన్ని పుస్తకాలు రాసి, గొప్ప రచయితగా పేరు తెచ్చుకోవాలనేది సన లక్ష్యమట. ఇంకేం.. ఈ నేస్తానికి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని