Published : 19 Jul 2022 01:18 IST

అబ్బో.. భలే జ్ఞాపకశక్తి!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మన దేశంలోని రాష్ట్రాలూ, వాటి రాజధాని నగరాల పేర్లు చెప్పమంటేనే.. తికమక పడుతుంటాం. కానీ, ఓ నేస్తం మాత్రం ప్రపంచ దేశాల పేర్లతోపాటు వాటి రాజధానులూ, అక్కడి కరెన్సీని కూడా గడగడా చెప్పేసింది. ఓ రికార్డూ సొంతం చేసుకుంది. ఇంతకీ తనెవరో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!

కేరళకు చెందిన అనీ విన్‌స్టన్‌ కుటుంబం చాలా సంవత్సరాల క్రితం దుబాయ్‌కు వలసవెళ్లింది. ఈ పాప తండ్రి ఉద్యోగరీత్యా వారంతా ప్రస్తుతం లండన్‌లో స్థిరపడ్డారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ ఎనిమిదేళ్ల చిన్నారి ఇటీవల ప్రపంచంలోని 195 దేశాల పేర్లను వాటి రాజధానులతో సహా చెప్పేసింది. అంతేకాదు, ఆయా దేశాల కరెన్సీని సైతం చెప్పింది. కేవలం 7 నిమిషాల 15 సెకన్లలోనే ఈ ఫీట్‌ను పూర్తి చేయడంతో ప్రపంచ రికార్డు సాధించింది. ‘ఓఎంజీ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో తన పేరు నమోదైంది. ఇప్పటివరకూ ఈ రికార్డు ఓ పదేళ్ల బాలిక పేరు మీద ఉండేది. తాను 12 నిమిషాల 24 సెకన్లలో ఈ ఘనత సాధించిందట.

స్కూల్‌కు వెళ్లి వచ్చేటప్పుడు.. 

అనీకి మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే, తల్లిదండ్రులు ఆమెలోని ప్రతిభను గుర్తించారట. ప్రతి రోజూ ఈ చిన్నారిని వాళ్ల నాన్నే బడికి తీసుకెళ్లి, తిరిగి ఇంటికి తీసుకొచ్చేవారు. ఆ సమయంలో అనీకి ఆయన వివిధ దేశాల పేర్లూ, అక్కడి సంస్కృతులకు సంబంధించిన విషయాలు చెబుతుండేవారు. అవన్నీ ఈ పాప శ్రద్ధగా వింటుండేది. అలా తనకు ప్రపంచంలోని అన్ని దేశాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. ఇంకేముంది.. అప్పటి నుంచి వారానికి అరగంట చొప్పున ఒక్కో దేశం గురించి పూర్తిగా తెలుసుకోసాగింది. ఆ వివరాలను ఓ క్రమపద్ధతిలో గుర్తుపెట్టుకుంది.

తాతయ్యకు అంకితం..

ఇటీవల ఆన్‌లైన్‌ వేదికగా అనీ ఓ ప్రదర్శనను ఇచ్చింది. ‘ఓఎంజీ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ ప్రతినిధులతోపాటు చిన్నారి తల్లిదండ్రులూ, బంధువులూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అతి తక్కువ సమయంలోనే అన్ని దేశాలూ, వాటి రాజధానులు, కరెన్సీల పేర్లు చెప్పి ఔరా అనిపించింది. ఈ నేస్తం రికార్డు సాధించిన సమయంలో తీసిన వీడియోను తన స్కూల్‌లోనూ ప్రదర్శించారట. ఇంకేం.. తరగతిలోని స్నేహితులతోపాటు టీచర్లంతా చప్పట్లు కొట్టి మరీ అనీని అభినందించారు. ఈ చిన్నారి తన రికార్డును, ఇటీవల మరణించిన తన తాతయ్యకు అంకితం చేసి.. ప్రేమను చాటుకుంది.


బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ కూడా..

అనీ.. కేవలం జ్ఞాపకశక్తిలోనే కాదు, ఇతర అంశాల్లోనూ చాలా చురుగ్గా ఉంటుంది. తాను అండర్‌-11 బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ కూడా. ఇప్పటికే ఎన్నో ట్రోఫీలూ గెలుచుకుంది. సైక్లింగ్‌ సాధనతోపాటు స్విమ్మింగ్‌, కుంగ్‌ఫూ కూడా నేర్చుకుంటోంది. ‘నేను సాధించిన రికార్డు.. ఇతర చిన్నారులకు స్ఫూర్తిగా నిలిస్తే చాలు’ అని చెబుతోందీ నేస్తం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts