Published : 21 Jul 2022 00:21 IST

వయసు చిన్న.. ప్రతిభ మిన్న!

హలో నేస్తాలూ.. మనలో చాలామంది గణితం అంటేనే భయపడిపోతుంటారు. మన పుస్తకాల్లోని లెక్కలే సరిగ్గా చేయలేము. కానీ, పెద్దవాళ్లనూ గడగడలాండించే లెక్కలను.. ఓ నేస్తం మాత్రం సులువుగా చేసేస్తోంది. అంతేకాదు.. తనకంటే పైతరగతుల్లోని విద్యార్థుల సందేహాలు కూడా తీరుస్తూ అబ్బురపరుస్తోంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో, ఆ వివరాలేంటో చదివేయండి మరి.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ద్రిష్టి మిశ్రా అనే చిన్నారి వయసు అయిదు సంవత్సరాలు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్న ఈ పాప.. ఆరో, ఏడో తరగతుల గణిత ప్రశ్నలనూ సునాయాసంగా చేసేస్తోందట. ఈ ప్రతిభను చూసిన అక్కడి వారంతా ‘వండర్‌ గర్ల్‌’ అని పిలుస్తున్నారు.

మొదటి నుంచే ప్రతిభ
చిన్నతనం నుంచే ద్రిష్టి అన్ని విషయాల్లో చాలా చురుగ్గా ఉండేదట. యూకేజీలో ఉండగానే రెండో, మూడో తరగతి లెక్కలు చేసేసేది. అప్పుడే ఈ చిన్నారి తండ్రి ఆమెలోని ప్రతిభను గుర్తించారు. మొదట్లో వాళ్ల ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఆడపిల్లను బడికి పంపించేవారు కాదట. కానీ, ద్రిష్టి తెలివితేటలను గమనించిన వాళ్ల నాన్న.. సమీపంలోని ఊరిలోనున్న ప్రభుత్వ బడిలో చేర్పించారు. తనకు ట్యూషన్‌ చెప్పించేందుకు, ఆ ఊరిలో కాస్త చదువుకున్న ప్రతి ఒక్కరినీ అడిగారాయన. కానీ, వారెవ్వరూ ముందుకు రాలేదు సరికదా.. ఆడపిల్లలకు చదువెందుకంటూ చులకనగా మాట్లాడారట. అయినా, ఆ తండ్రీకూతుళ్లు పట్టువిడవలేదు. ఎన్నో రకాలుగా ప్రయత్నించాక.. ఓ యాప్‌ గురించి తెలుసుకుందీ చిన్నారి. అందులో సబ్జెక్ట్‌ నిపుణులు పాఠాలు చెప్పడంతోపాటు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ సందేహాలను తీరుస్తారు. అలా రోజుకు నాలుగైదు గంటలు ఆ యాప్‌ ద్వారానే ఆన్‌లైన్‌లో చదువుకోవడం ప్రారంభించింది. అంతేకాదు.. గ్రామంలో తనకంటే పెద్ద వయసు పిల్లలకూ క్లాసులు చెబుతుందీ పాప.

గతంలోనే ఓ రికార్డు
ఇంత ప్రతిభ ఉన్న ద్రిష్టి పేరు ఇదివరకే ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో నమోదైంది. ఎందుకూ అంటే.. కేవలం 2 నిమిషాల 56 సెకన్లలోనే ప్రపంచంలోని అన్ని దేశాలూ, వాటి రాజధానుల పేర్లతోపాటు వాటి జెండాల వివరాలూ చెప్పేసిందట. అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించి.. శెభాష్‌ అనిపించుకుంది. పెద్దయ్యాక కలెక్టర్‌ అయ్యి.. సమాజానికి మంచి చేస్తాననీ, చదువుకోవాలని ఉండీ.. సౌకర్యాలు లేక నిరుత్సాహపడే ఆడపిల్లలకు విద్య అందించేందుకు కృషి చేస్తానని చెబుతోందీ నేస్తం. చిన్న వయసులోనే తన మేధస్సుతో ఆశ్చర్యపరుస్తున్న ఈ పాప.. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృషించాలని మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts