Published : 23 Jul 2022 00:23 IST

రింగు తిప్పేస్తూ.. రికార్డులు సాధిస్తూ..

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనలో చాలామందికి హులా-హూప్‌ అంటేనే తెలియదు. కొందరు ఎక్కడైనా చూసినా.. దాన్ని తిప్పటం మాత్రం తెలిసి ఉండకపోవచ్చు. అందుకు చాలా ప్రాక్టీస్‌ అవసరం కూడా. కానీ, ఓ నేస్తం మాత్రం ఆ హులా-హూప్‌ విన్యాసాలతో రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. ఆ వివరాలివీ..

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి చెందిన దీక్షితకు పదకొండు సంవత్సరాలు. చాలామందికి పరిచయం కూడా ఉండని ‘హులా-హూప్‌’లో ప్రతిభ చూపుతూ ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న ఈ బాలిక, హులా-హూప్‌ రింగును తన పాదం చుట్టూ ఒక్క నిమిషంలో 207 సార్లు తిప్పేసింది. అంతేకాదు.. ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది.

ఇదే మొదటిది కాదు..
గత ఏప్రిల్‌ నెలలో చేసిన ఈ ఫీట్‌కు తాజాగా గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు రికార్డు అందించారు. అలాగనీ, తనకు ఇదే మొదటిది కాదు ఫ్రెండ్స్‌.. గతేడాది నవంబర్‌లో మోకాళ్ల చుట్టూ అర నిమిషంలో ఎక్కువసార్లు హులా-హూప్‌ను తిప్పి గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కేసింది. జిమ్నాస్టిక్స్‌ కూడా బాగా చేయగల ఈ చిన్నారి.. గతంలో ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఫ్యూచర్‌ అబ్దుల్‌ కలాం బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు దక్కించుకుంది.

ఆన్‌లైన్‌ శిక్షణతో..  
దీక్షితకు చిన్నతనంలోనే హులా-హూప్‌ పైన ఆసక్తి ఏర్పడింది. ఒకసారి తల్లిదండ్రులతో కలిసి ఓ షాపింగ్‌ మాల్‌కు వెళ్లినప్పుడు రింగు కొనుక్కుంది. తరవాత ఇంటికొచ్చాక.. యూట్యూబ్‌లో రకరకాల వీడియోలు చూస్తూ.. ఆ హులా-హూప్‌ను పట్టుకోవడం, తిప్పడం వంటి తదితర ప్రాథమిక అంశాలు నేర్చుకుంది. కొద్దిరోజులకే కరోనా కేసుల కట్టడికి లాక్‌డౌన్‌ విధించడంతో బయటకు వెళ్లి, శిక్షణ తీసుకోలేకపోయింది. దాంతో చేసేది లేక.. ఒక కోచ్‌ సాయంతో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కావడం ప్రారంభించింది. ఆ కోచ్‌ దగ్గర శిక్షణ పొందుతున్న వారిలో చాలామంది గతంలో అనేక రికార్డులు సాధించారట. ఆన్‌లైన్‌లోనే రోజూ ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు ప్రాక్టీస్‌ చేయసాగింది దీక్షిత.

ఒకేసారి నాలుగు రింగులు..
ఆసక్తితోపాటు క్రమశిక్షణతో నేర్చుకుంటున్న ఈ నేస్తం.. ఒకేసారి నాలుగు రింగులను తిప్పగలదట. ఎలా అంటే, రెండు చేతుల్లో ఒక్కోటి.. మెడకు ఒకటి, కాళ్లతో మరొకటి గిరగిరలాడించగల నేర్పరి. మొదటి నుంచే హులా-హూప్‌లో ఏదైనా రికార్డు సాధించాలని ఈ చిన్నారికి ఉండేదట. గిన్నిస్‌ రికార్డుల్లో ఏయే విభాగాలు ఉన్నాయో చూసుకొని మరీ.. అందుకు తగినట్లు శిక్షణ తీసుకుంది. గత ఏప్రిల్‌లో నిపుణుల ఆధ్వర్యంలో ప్రదర్శన ఇచ్చి.. సంబంధిత వీడియోలను గిన్నిస్‌ బుక్‌ సంస్థకు పంపింది. ఆ ప్రతినిధులు అన్ని కోణాల్లో దీక్షిత ప్రతిభను పరిశీలించాక, ఇటీవలే రికార్డు ధ్రువీకరణ పత్రం అందించారు. దీనికి దాదాపు ఆరు నెలల సమయం పట్టింది. వీళ్ల ఇంట్లో వివిధ పరిమాణాల్లో మొత్తం 18 రింగులు ఉన్నాయట. భవిష్యత్తులో తన రికార్డును తానే బద్దలు కొడతానని ధీమాగా చెబుతోంది దీక్షిత.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని