చదరంగంలో ప్రతిభ

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘మీకు చదరంగం ఆడటం వచ్చా?’ అని ఎవరైనా అడిగితే మనలో చాలామంది ‘ఓ.. చాలా బాగా వచ్చు’ అని సమాధానం ఇస్తుంటాం. ‘ఎవరు నేర్పించారు?’ అంటే అమ్మ పేరో, నాన్న

Published : 27 Jul 2022 00:17 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘మీకు చదరంగం ఆడటం వచ్చా?’ అని ఎవరైనా అడిగితే మనలో చాలామంది ‘ఓ.. చాలా బాగా వచ్చు’ అని సమాధానం ఇస్తుంటాం. ‘ఎవరు నేర్పించారు?’ అంటే అమ్మ పేరో, నాన్న పేరో చెబుతాం. అలాగే, ఓ నేస్తం కూడా వాళ్ల నాన్న నుంచి ఆటను నేర్చుకోవడమే కాకుండా ఇతరులకూ అవగాహన కల్పిస్తున్నాడు. ఆ వివరాలేంటో చదివేయండి మరి.

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి చెందిన సాయి స్వరూప్‌కి ప్రస్తుతం 12 సంవత్సరాలు. నాలుగేళ్ల వయసు నుంచే చదరంగం(చెస్‌) ఆడటం ప్రారంభించిన ఈ నేస్తం..  2019, 2020లో వరసగా రెండేళ్లు ‘తమిళనాడు రాష్ట్ర స్థాయి పిల్లల చెస్‌ ఛాంపియన్‌షిప్‌’ను కైవసం చేసుకున్నాడు. అంతేకాదు.. గతేడాది అండర్‌-12 విభాగంలో ఆలిండియా ఆన్‌లైన్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌నూ సాధించాడు.

తండ్రి నుంచి..
మాటలతోపాటు నడకే సరిగ్గా రాని నాలుగేళ్ల వయసులోనే సాయి స్వరూప్‌ చదరంగం పట్ల ఆకర్షితుడయ్యాడు. అందుకు తన తండ్రే కారణమట. ‘చిన్నతనంలో నేను మా సోదరులతో కలిసి పెరిగా. వారిలో చాలామంది వివిధ స్థాయిల్లో జరిగిన చెస్‌ టోర్నమెంట్లలో విజయం సాధించారు. బోలెడు ట్రోఫీలూ అందుకున్నారు. అలా వారి నుంచి చెస్‌లో ప్రాథమిక అంశాలు నేర్చుకున్నా. ఆ విషయాలనే నా కొడుకుకు కూడా నేర్పించా’ అని సాయి వాళ్ల నాన్న చెబుతున్నారు.

ఒత్తిడి హుష్‌కాకి..
కొవిడ్‌ కేసుల కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను ఈ నేస్తం చక్కగా వినియోగించుకున్నాడు. ఇంటి దగ్గరే ఉంటూ ఆన్‌లైన్‌లో తన ప్రతిభను మెరుగుపరుచుకున్నాడు. అక్కడితో ఆగిపోకుండా.. సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి మరీ.. దాని ద్వారా ఆటకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించడం ప్రారంభించాడు. ఎక్కువగా తన వయసు వారినే దృష్టిలో ఉంచుకొని, అందుకు తగినట్లుగా వీడియోలను రూపొందిస్తున్నాడు. ప్రతి రోజూ దాదాపు అయిదు గంటలపాటు ఆటను ప్రాక్టీస్‌ చేస్తాడట. అంతేకాదు.. చదరంగం ఏకాగ్రతను పెంపొందించడంతోపాటు ఒత్తిడినీ దూరం చేస్తోందని చెబుతున్నాడు సాయి స్వరూప్‌. సమయ పాలన సైతం అలవడుతోందట. ఇవన్నీ చదువు విషయంలోనూ తనకు ఎంతో తోడ్పడుతున్నాయట.

స్కూల్‌ పిల్లలకు..
తన యూట్యూబ్‌ వీడియోలూ, వర్క్‌షాప్‌లతో ఎక్కువ మందికి ఆటను పరిచయం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడీ బాలుడు. ఇప్పటివరకూ రష్యాలో ఎక్కువ మంది గ్రాండ్‌ మాస్టర్లు ఉన్నారనీ, అంతకంటే అధిక జనాభా ఉన్న మన దేశం నుంచి కూడా వీలైనంత మంది ఆటగాళ్లను తయారు చేయాలనేది తన ఉద్దేశం. ఇటీవల ‘ఇంటర్నేషనల్‌ చెస్‌ డే’ సందర్భంగా తన స్కూల్‌లో ప్రత్యేకంగా ఓ వర్క్‌షాప్‌ నిర్వహించాడీ నేస్తం. ఎప్పటికైనా భారత్‌ను చెస్‌లో ఉత్తమంగా నిలపాలని ప్రయత్నిస్తున్న సాయి స్వరూప్‌కు మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని