జ్ఞాపకశక్తి భళా..!

హలో ఫ్రెండ్స్‌.. నిన్న చెప్పిన పాఠంలోంచి కొన్ని ప్రశ్నలు అడుగుతానని టీచర్‌ చెబితేనే.. ‘బాబోయ్‌’ అని భయపడతాం. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయంటే, గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అలాంటిది,

Published : 30 Jul 2022 00:22 IST

హలో ఫ్రెండ్స్‌.. నిన్న చెప్పిన పాఠంలోంచి కొన్ని ప్రశ్నలు అడుగుతానని టీచర్‌ చెబితేనే.. ‘బాబోయ్‌’ అని భయపడతాం. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయంటే, గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అలాంటిది, చిన్న వయసులోనే తన జ్ఞాపకశక్తితో అబ్బురపరుస్తున్నాడో నేస్తం. ఆ బాలుడు ఎవరో, అతడి వివరాలేంటో చదివేయండి మరి..

దిల్లీకి చెందిన సార్థక్‌ బిశ్వాస్‌కు ప్రస్తుతం ఎనిమిది సంవత్సరాలు. హుషారుగా బడికి వెళ్తూ.. ఇంటికొచ్చాక స్నేహితులతో సరదాగా ఆడిపాడే ఈ వయసులోనే రికార్డులు సాధిస్తున్నాడీ నేస్తం. ప్రపంచంలోని దేశాల పేర్లు, వాటి రాజధానులు, అక్కడి కరెన్సీ, భాష తదితర వివరాలను అతి తక్కువ సమయంలో చెప్పిన అతి చిన్న వయస్కుడిగా ‘ఓఎంజీ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం దక్కించుకున్నాడు.

ఒక్కసారి చూస్తే చాలు..
మన సార్థక్‌కు చిన్నతనం నుంచే జ్ఞాపకశక్తి ఎక్కువట. ఈ విషయాన్ని వైద్యులైన ఆ బాలుడి తల్లిదండ్రులే చెబుతున్నారు. ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న ఈ నేస్తం.. దేన్నైనా ఒక్కసారి చూస్తే ఇట్టే గుర్తుంచుకుంటాడట. ఆ ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు.. ఏదైనా రికార్డు సాధించేలా చేయాలని అనుకున్నారట. అలా అప్పటి నుంచి వివిధ దేశాలకు సంబంధించిన వివరాలను బొమ్మలతో సహా వివరంగా చెబుతుండేవారు. అలా చెప్పిన అంశాల్లో ఎంత శాతం గుర్తుంచుకున్నాడోనని వారానికోసారి కొడుకును పరీక్షించేవారట.

ఆన్‌లైన్‌ వేదికగా..
మొన్న జూన్‌లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సార్థక్‌ ప్రతిభ చూసి.. న్యాయనిర్ణేతలు ఆశ్చర్యపోయారట. ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన 195 దేశాల పేర్లు, వాటి రాజధానులు, అక్కడి కరెన్సీ, భాష తదితర అంశాలను కేవలం జెండాల ఆధారంగా చెప్పేశాడట. కేవలం 8 నిమిషాల 43 సెకన్లలోనే ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కుడిగా ఈ బాలుడి పేరు ‘ఓఎంజీ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చేరింది. చాలా దేశాల జెండాలు దాదాపు ఒకేలా ఉంటాయి.. అలాంటిది కేవలం ఆయా దేశాల జెండాలు చూసే, ఈ నేస్తం ఈ ఫీట్‌ సాధించడం మామూలు విషయం కాదు కదా ఫ్రెండ్స్‌! సార్థక్‌ ప్రతిభ.. ఇదివరకే ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోకి కూడా చేరిపోయింది. నిజంగా ఈ నేస్తం చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు