Published : 31 Jul 2022 00:19 IST

హూలా-హూపర్స్‌.. రికార్డుల్లో టాపర్స్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కాలంటే చాలా కష్టం కదూ! కానీ కొందరు చిన్నారులు మాత్రం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదకొండు గిన్నిస్‌ రికార్డులు సొంతం చేసుకుని, అందరితో ‘ఔరా!’ అనిపించుకుంటున్నారు. మరి ఆ వివరాలేంటో మనం తెలుసుకుందామా!

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో హూలా-హూపర్స్‌ గ్రూప్‌ ఒకటి ఉంది. దీనికి విజయలక్ష్మి ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె పలువురు చిన్నారులకు హూలా-హూపింగ్‌లో శిక్షణ ఇచ్చారు. అందులో కొంతమంది ‘హూలా-హూప్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ సొంతం చేసుకున్నారు. విజయలక్ష్మి గత పదేళ్లుగా హూలా-హూపింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. 2018లో ‘చెన్నై హూలా-హూపర్స్‌’ పేరుతో ఓ గ్రూప్‌ను తయారు చేశారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో 4 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు 40 మంది ఉన్నారు. ఇందులో ఏడుగురు పిల్లలున్న ఓ బృందం ఏకంగా 11 ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ను సాధించింది.

చాలా.. చాలా.. కష్టం..
‘హూలా-హూప్‌ రింగ్‌తో తక్కువ సమయంలో ఎక్కువ రొటేషన్లు చేయడం చాలా కష్టం. దీని కోసం ఎంతో ప్రాక్టీస్‌ కావాలి. ఇది ఒక్క రోజులో సాధ్యమయ్యేది కాదు’ అంటున్నాడు ధనురుధ్‌. ‘మొదట్లో నాకు చాలా కష్టంగా అనిపించింది. కానీ రాను రాను అలవాటైంది. రోజూ ప్రాక్టీస్‌ చేయడంతో అనుకున్న వేగానికి చేరుకోగలిగాను. దానివల్లే నేను వరల్డ్‌ రికార్డ్‌ సాధించగలిగాను’ అంటున్నాడు తరుణ్‌.

ప్రత్యేక గుర్తింపు...
ఇలా ఈ చిచ్చరపిడుగులు ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. చెన్నైకు ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తున్నారు. వీళ్లందరికీ శిక్షణ ఇస్తున్న విజయలక్ష్మి... మరింత ఎక్కువ మంది పిల్లలను తీర్చిదిద్దాలనుకుంటున్నారు. వారితో మరిన్ని రికార్డులు కొల్లగొట్టాలని చూస్తున్నారు. అంటే భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించే హూలా-హూపర్స్‌ వస్తారన్నమాట. మొత్తానికి ఇవీ హూలా-హూపర్స్‌ విశేషాలు. మరింకెందుకు ఆలస్యం నేస్తాలూ.... మీరూ హూలా-హూప్‌ రింగ్‌ తీసుకుని ప్రాక్టీస్‌ చేసేయండి. ఎవరికి తెలుసు.. భవిష్యత్తులో మీరూ రికార్డు సాధిస్తారేమో!

రికార్డులే రికార్డులు...
తరుణ్‌ అనే అబ్బాయి ఒక నిమిషంలో 193 సార్లు తన మోకాళ్లతో రింగ్‌ను తిప్పాడు. ధనురుధ్‌ అనే చిచ్చరపిడుగు ఒక నిమిషంలో అత్యధికసార్లు మోచేతితో రింగ్‌ను తిప్పాడు. గుర్‌ప్రశాంత్‌ మెడతో, కనిష్క పాదంతో.. ఒక నిమిషంలో ఎక్కువసార్లు హూలా-హూప్‌ రింగ్‌ను తిప్పి రికార్డుల మీద రికార్డులు సృష్టించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని