Published : 02 Aug 2022 00:24 IST

కామన్వెల్త్‌ బరి.. పతకంపైనే గురి!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బడిలో నిర్వహించే ఆటలపోటీల్లో ఏదైనా చిన్న బహుమతి వస్తేనే తెగ సంబరపడిపోతాం. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటే అందరూ శెభాష్‌ అంటారు. అలాంటిది.. ఓ నేస్తానికి ఏకంగా కామన్వెల్త్‌ పోటీల్లోనే పాల్గొనే అవకాశం దక్కింది. అంతేకాదు, దేశం నుంచి ఆ క్రీడా సంగ్రామంలో పాల్గొంటున్న వారిలో అతి పిన్న వయస్కురాలిగానూ నిలిచింది. ఆ వివరాలే ఇవీ..

దిల్లీకి చెందిన స్క్వాష్‌ క్రీడాకారిణి అనహత్‌ సింగ్‌కు 14 సంవత్సరాలు. అండర్‌-15 విభాగంలో ఆసియాలో నెంబర్‌ వన్‌ క్రీడాకారిణి తను. ఆటలో అద్భుత ప్రతిభతో ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్‌ పోటీల్లో తలపడే అవకాశం దక్కించుకుంది. విశేషమేంటంటే.. భారత్‌ నుంచి ఈ పోటీలకు హాజరైన క్రీడాకారుల్లో అతి పిన్న వయస్కురాలిగా మన అనహత్‌ రికార్డు సృష్టించింది.  

బ్యాడ్మింటన్‌తో మొదలై..  

ఆరేళ్ల వయసులో పి.వి.సింధు ఆటను చూసిన అనహత్‌.. బ్యాడ్మింటన్‌ వైపు ఆకర్షితురాలైంది. అందులో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. దిల్లీ స్థాయిలో జరిగిన కొన్ని పోటీల్లోనూ ఛాంపియన్‌గా నిలిచింది. రెండేళ్ల తరవాత అంటే ఎనిమిదేళ్ల వయసులో ఆమె దృష్టి స్క్వాష్‌ వైపు మళ్లింది. ఈ నేస్తం అక్క కూడా స్క్వాష్‌లో జాతీయ స్థాయి క్రీడాకారిణి కావడంతో ఇక వెనుతిరిగి చూసుకోలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, సోదరి మార్గదర్శకంలో ప్రాక్టీస్‌ ప్రారంభించింది. కొద్దిరోజుల్లోనే అండర్‌-11 విభాగంలో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. తరవాత, అండర్‌-13లో ఆసియాతోపాటు యూరప్‌ స్థాయిలో నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుంది.

ఎవరికీ సాధ్యం కానిది..

2019లో అనహత్‌ పేరు మార్మోగిపోయింది. అప్పటివరకూ భారత్‌కు కలగానే మిగిలిన బ్రిటిష్‌ ఓపెన్‌ స్క్వాష్‌ టోర్నమెంట్‌తోపాటు ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో విజేతగా నిలిచింది. కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే ఈ బాలిక 46 నేషనల్‌ సర్క్యూట్‌ టైటిల్స్‌తోపాటు రెండు జాతీయ, ఎనిమిది అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లను కైవసం చేసుకుంది. గతేడాది యూఎస్‌ జూనియర్‌ స్క్వాష్‌ ఓపెన్‌లోనూ నెగ్గింది.

నిర్ణేతలను మెప్పించి..

అక్క అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ స్క్వాష్‌ బృందంలో సభ్యురాలిగా ఉంటే, చెల్లి అనహత్‌ కామన్వెల్త్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. అనహత్‌ వయసు తక్కువ కావడంతో కామన్వెల్త్‌ పోటీలకు ఎంపిక చేయాలా వద్దా అని నిర్ణేతలు మొదట్లో ఆలోచనలో పడిపోయారు. అయితే, తన అద్భుత ప్రతిభతోపాటు సమయస్ఫూర్తితో నిర్ణేతలను మెప్పించగలగింది. మహామహులతోపాటు పోటీల్లో పాల్గొనే ఛాన్స్‌ కొట్టేసింది. గత వారం మొదలైన కామన్వెల్త్‌ పోటీల్లో.. తొలి రౌండ్‌లో విజయం దక్కించుకున్న ఈ నేస్తం.. తదుపరి రౌండ్‌కు సమాయత్తం అవుతోంది. ఈ పోటీల్లోనూ ఛాంపియన్‌గా నిలిచి, దేశానికి పతకం తీసుకురావాలని అనహత్‌కు మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts