Published : 04 Aug 2022 00:20 IST

రయ్‌.. రయ్‌మంటూ..

హలో ఫ్రెండ్స్‌.. ఉదయమో, సాయంత్రమో నాన్న బండిపైన ఒక రౌండ్‌ వేస్తేనే కానీ చిన్నపిల్లలు ఊరుకోరు. కాస్త పెద్దయ్యాక.. ఇంట్లో వాళ్లు బైక్‌ మీద ఎక్కడికైనా వెళ్తుంటే, ‘నేనొస్తా’ అంటూ వెంటపడతాం. ఇంకాస్త పెద్దయ్యాక అయితే.. ‘నాకూ బైక్‌ నేర్పించండి’ అంటూ మారాం చేస్తాం. ఓ నేస్తం అయితే ఏకంగా స్పోర్ట్స్‌ బైక్స్‌ నడపడమే కాకుండా పోటీల్లోనూ పాల్గొంటూ వావ్‌ అనిపిస్తున్నాడు. ఆ వివరాలే ఇవీ..

బెంగళూరుకు చెందిన శ్రేయస్‌కు 11 సంవత్సరాలు. ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్న ఈ నేస్తానికి చిన్నప్పటి నుంచి బైక్‌ రైడింగ్‌ అంటే ఇష్టం. చిన్నతనంలో వాళ్ల నాన్న తరచూ బైక్‌ మీద తీసుకెళ్లేవాడట. అలా క్రమక్రమంగా అది ఇష్టంగా మారింది. ఇప్పుడు పెద్ద పెద్ద రేసింగ్‌ ఈవెంట్లలో పాల్గొంటూ ‘ది బెంగళూరు కిడ్‌’గా పేరు తెచ్చుకున్నాడు.

అనుకోకుండా అలా..
ఒకరోజు నాన్నకు వాళ్ల ఫ్రెండ్‌ ఒకరు ఫోన్‌ చేసి, శ్రేయస్‌ను తీసుకొని గ్రౌండ్‌కు రమ్మన్నాడట. శ్రేయస్‌కు రైడింగ్‌ అంటే ఇష్టమని తెలిసిన ఆయన.. తన వద్ద ఉన్న ఒక చిన్న బైక్‌ను ఇచ్చి.. నడపమనడంతో ఎగిరి గంతేశాడట. అలా అనుకోకుండా మొదటిసారి నడిపే ఛాన్స్‌ దక్కింది. తొలిసారే అయినా, ఎవరి సహాయం లేకుండానే చక్కగా నడిపాడట. తరవాత రేసింగ్‌ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న ఈ బాలుడికి, మద్రాస్‌ మోటార్‌ రేస్‌ ట్రాక్‌పైన జరిగిన ఛాంపియన్‌షిప్‌ పోటీలు గుర్తింపు తీసుకొచ్చాయి. రేసింగ్‌ అంటే మాటలు కాదు కదా ఫ్రెండ్స్‌.. అందుకే, పోటీల్లో పాల్గొనేముందు అన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకుంటాడట. అంతేకాదు, వాళ్ల నాన్నే.. దగ్గరుండి మరీ బైక్‌ కండీషన్‌ చెక్‌ చేయిస్తారట.

చదువుకుంటూనే..
లాక్‌డౌన్‌ సమయంలో రేసింగ్‌ పోటీలూ, తరగతులూ లేకపోవడంతో శ్రేయస్‌ బాగా నిరుత్సాహపడ్డాడట. ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమయ్యాక.. అవి వింటూనే, ఇంటి దగ్గరున్న గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించాడు. దొరికిన ఖాళీ సమయాన్ని తన ఇష్టమైన బైక్‌ రేసింగ్‌కి వినియోగించుకున్నాడన్నమాట. ‘డ్రైవింగ్‌ వచ్చు కదా అనీ.. ఇంటి పని కోసం శ్రేయస్‌కి అస్సలే బైక్‌ ఇవ్వం. తన కెరియర్‌ కోసం నేను ఉద్యోగం కూడా మానేశాను. ఎప్పటికైనా బాబును గొప్ప రేసర్‌గా తీర్చిదిద్దాలన్నదే మా ధ్యేయం’ అని వాళ్ల నాన్న చెబుతున్నారు. ఈ నేస్తం ప్రస్తుతం టీవీఎస్‌ రేసింగ్‌ కప్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు.

జాతీయ గీతం ఆలపించాలని..
‘రేసింగ్‌లో టాప్‌గా భావించే మోటోజీపీ పోటీల్లో ఎప్పుడూ వేరే దేశాల జాతీయ గీతాలే వినిపిస్తున్నాయి. మనది ఎందుకు పాడటం లేదు’ అని ఒకసారి వాళ్ల నాన్నను అడిగాడు శ్రేయస్‌. అందుకు ఆయన ‘పోటీల్లో ఏ దేశం వాళ్లు గెలిస్తే, వాళ్ల గీతమే ఆలపిస్తారు’ అని సమాధానమిచ్చారు. దాంతో ఆరోజు నుంచి మోటోజీపీ పోటీల్లో భారత దేశ జాతీయ గీతం వినిపించేలా చేయడమే తన లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెబుతున్నాడీ నేస్తం. మరి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని