బుజ్జి బుడత.. కరాటేలో చిరుత!

బుడి బుడి అడుగుల బుడత.. ‘హు..హా...’ కరాటేలో చిరుత.. చూస్తే చిరునవ్వుల చిన్నారి.. పాల బుగ్గల పొన్నారి.. కానీ బరిలో దిగితే మాత్రం పతకాల వేటలో తప్పదు గురి!

Published : 07 Aug 2022 00:17 IST

బుడి బుడి అడుగుల బుడత.. ‘హు..హా...’ కరాటేలో చిరుత.. చూస్తే చిరునవ్వుల చిన్నారి.. పాల బుగ్గల పొన్నారి.. కానీ బరిలో దిగితే మాత్రం పతకాల వేటలో తప్పదు గురి!

ఖమ్మంలోని రోటరీ నగర్‌కు చెందిన పిన్నపురాల గ్రేస్‌ వయసు కేవలం అయిదేళ్లు. ప్రస్తుతం స్థానిక మండల పరిషత్తు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఈ వయసులోనే కరాటేలో ఏకంగా బ్లాక్‌బెల్ట్‌ సాధించింది. అంతే కాదు నేస్తాలూ.. మొదటిపోటీలోనే ఏకంగా తన ఖాతాలో మూడు స్వర్ణ పతకాలు వేసుకుంది. ఇంతా చేస్తే మన గ్రేస్‌ కరాటే నేర్చుకుని కేవలం మూడు నెలలే అవుతోంది.

చిన్ని సివంగి!
‘అయితే.. ఏదో సరదాగా అడిగింది అనుకున్నాం కానీ సీరియస్‌గా నేర్చుకుంటుందని అస్సలు ఊహించలేదు’ అని నాన్న సమ్మయ్య ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోజూ ఉదయం 5 గంటలకు ఎవరూ నిద్ర లేపకుండానే తనే మేల్కొని శిక్షణకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంటుంది. అలాగే, సాయంత్రం బడి నుంచి వచ్చాక 6 గంటలకు శిక్షణ కేంద్రానికి వెళ్లడానికి ఈ చిన్ని సివంగి ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. కేవలం మూడు నెలల ముందు నుంచే కరాటే నేర్చుకుంటూ, తాను పాల్గొన్న మొదటి పోటీలోనే బహుమతుల పంట పండించింది.


ముచ్చెమటలు పట్టాల్సిందే...

మన బుజ్జి గ్రేస్‌ బరిలో దిగితే... ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టాల్సిందే. కేవలం అయిదు సంవత్సరాల వయసులో బ్లాక్‌బెల్ట్‌ సాధించి, జాతీయస్థాయి కరాటే ఛాంపియన్‌ షిప్‌లో మూడు స్వర్ణాలు కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపిన్న వయసులో బ్లాక్‌బెల్ట్‌ సాధించిన చిన్నారిగా రికార్డు సృష్టించింది.


కంట పడితే.. ఒంట పట్టించుకుంది!

ఖమ్మం నగరంలోని రోటరీ నగర్‌కు చెందిన సమ్మయ్య, గాయత్రి దంపతుల రెండో సంతానమే గ్రేస్‌. వీరి కాలనీకి సమీపాన విజయ డెయిరీ కేంద్రంలోని ఓ ఖాళీ ప్రదేశంలో కోచ్‌ రామకృష్ణ చిన్నారులకు కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పిస్తుంటారు. ఓ రోజు తాతతో అటుగా వెళుతున్న గ్రేస్‌ కంట కరాటే శిక్షణ దృశ్యాలు పడ్డాయి. అంతే వెంటనే... తానూ నేర్చుకుంటానని మారాం చేసింది. ఇంటికొచ్చాక చేర్పించేవరకూ ఏడుస్తూనే ఉంది. పాప ఆసక్తి చూసి తల్లిదండ్రులు కరాటే శిక్షణలో చేర్పించారు.


బెదురు లేదు.. ఎదురూ లేదు!

సుమన్‌ షాటోకాన్‌ స్పోర్ట్స్‌ కరాటే-డీఓ అకాడమీ ఇండియా వారి ఆధ్వర్యంలో జులై 24న సూర్యాపేటలో కేసరిచందర్‌ మెమోరియల్‌ జాతీయ ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌లో ఈ చిన్నారి పాల్గొంది. మొత్తం 1000 మందిలో అన్ని రాష్ట్రాల చిన్నారులు బరిలో నిలిచినా.. మొదటిసారే అయినా బెరుకు లేకుండా అత్యుత్తమ ప్రతిభతో ఏకంగా మూడు స్వర్ణాలు గెల్చుకుంది. కటా, కుమిటే(స్పేరింగ్‌), వెపన్‌ కటా(ఇందులో స్టిక్‌ కటా, స్వార్డ్‌ కటా) విభాగాల్లో విజేతగా నిలిచింది.


సుమన్‌ మనసు దోచి....

బహుమతి ప్రదానోత్సవం రోజున చిన్నారి గ్రేస్‌ ప్రతిభ చూసి నటుడు సుమన్‌ మంత్రముగ్ధులయ్యారు. దీంతో వెంటనే స్టేజ్‌ మీదకు పిలిచి అక్కడికక్కడే బ్లాక్‌బెల్ట్‌ ప్రదానం చేశారు. చిన్నారికి మంచి భవిష్యత్తు ఉందని ఆశీర్వదించారు. సుమన్‌ చేతుల మీదుగా బంగారు పతకాలు, ప్రశంసాపత్రం, బ్లాక్‌బెల్ట్‌ అందుకుందీ చిన్నారి.


కోచ్‌ మెచ్చిన శిష్యురాలు!

‘ఎందరో చిన్నారులను చూశాను.. కానీ గ్రేస్‌లా ఎవరూ ఇంతలా నేర్చుకోలేదని, సమయానికి రావడం, అంతేకాకుండా క్రమం తప్పకుండా, చెప్పింది తడబడకుండా వెంటనే బాగా చేయడం లాంటివి ఈ చిన్నారిలోనే చూశాను’ అని కోచ్‌ రామకృష్ణ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలికల విభాగంలో కేవలం అయిదు సంవత్సరాల వయసులో తెలంగాణ మొత్తం మీద బ్లాక్‌బెల్ట్‌ పొందిన మొదటి చిన్నారి గ్రేస్‌నే అని ఆయన అన్నారు.


సమయం వృథా చేయదు...

‘స్మార్ట్‌ ఫోన్లు, కార్టూన్లు చూస్తూ సమయం వృథా చేయదు గ్రేస్‌. ఖాళీ సమయంలో కరాటే, తైక్వాండో నేర్చుకుంటూ, చదువుకూ ప్రాధాన్యమిస్తోంది’ అని ఆనందంగా చెబుతున్నారు ఈ చిన్నారి అమ్మానాన్న. ‘ఈత కూడా నేర్చుకుని భవిష్యత్తులో మంచి క్రీడాకారిణిగా ఎదిగి మన దేశానికి మంచి పేరు తీసుకొస్తా’ అని ముద్దుముద్దుగా చెబుతున్న చిన్నారి గ్రేస్‌కు మనమంతా ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా మరి!


- భూపతి సత్యనారాయణ, ఈజేఎస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని