బుడత కొంచెం.. జ్ఞాపకశక్తి ఘనం!

వయసు కేవలం ఎనిమిదేళ్లు. సాధించిన రికార్డులు మాత్రం ముప్ఫై! చిరుప్రాయంలోనే చిరుతలా దూసుకుపోతోంది. తన అద్భుత జ్ఞాపకశక్తితో విశేష ప్రతిభ కనబరుస్తూ రికార్డుల మీద రికార్డులు

Published : 14 Aug 2022 00:42 IST

వయసు కేవలం ఎనిమిదేళ్లు. సాధించిన రికార్డులు మాత్రం ముప్ఫై! చిరుప్రాయంలోనే చిరుతలా దూసుకుపోతోంది. తన అద్భుత జ్ఞాపకశక్తితో విశేష ప్రతిభ కనబరుస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా?

ఏలూరు నగరానికి చెందిన నారాయణం జాగృతి ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. చిన్న వయసులోనే అపార జ్ఞాపకశక్తితో అద్భుతాలు సృష్టిస్తోంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఏలూరులో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మూడు అంశాల్లో ప్రతిభ కనబరిచి ‘తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం పొందింది. అంతేకాదు.. మూడేళ్ల ప్రాయం నుంచే ఇలాంటి పలు రికార్డులు సొంతం చేసుకుందీ బాలిక. ఇప్పటివరకు 30 రికార్డులను తన ఖాతాలో జమ చేసుకుంది.

ఒకే ఏడాదిలో అయిదు అవార్డులు
రెండేళ్ల వయసులోనే జాగృతికి అపార జ్ఞాపకశక్తి ఉండటాన్ని అమ్మానాన్న శివశంకర్‌, సుగుణ గుర్తించారు. అప్పటి నుంచే పలు అంశాల్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఇంటి వద్దే పలు అంశాల గురించి తండ్రి వివరంగా చెప్పేవారు. అలా నేర్పించిన విషయాలను ఈ చిన్నారి మర్చిపోకుండా ఉండటమే కాకుండా ఎప్పుడు అడిగినా వెంటనే చెప్పగలిగేది. రెండు సంవత్సరాల 11 నెలల వయసులో వేదికపై తొలి ప్రదర్శన ఇచ్చింది. ఒకే ఏడాదిలో ఏకంగా అయిదు అవార్డులు అందుకుంది. 2017లో శతాధిక చిత్రధారణ, ద్విశతాధిక చిత్రధారణ, త్రిశతాధిక చిత్రధారణ, శతక పద్యధారణ ప్రదర్శనలు ఇచ్చి రికార్డు సృష్టించింది.

నాలుగేళ్ల వయసులో..
నాలుగేళ్ల ఏడు నెలల వయసులో 2018లో శతాధిక ప్రశ్నోత్తర ప్రహేళిక ప్రదర్శన ఇచ్చి అవార్డు అందుకుంది. నాలుగేళ్ల 9 నెలల వయసులో 2019లో ద్విశతాధిక ప్రశ్నోత్తరాలు, త్రిశతాధిక ప్రశ్నోత్తరాలు, శతాధిక పొడుపులు ప్రదర్శనలు ఇచ్చి పురస్కారాలు దక్కించుకుంది. 2020లో ఏకంగా అయిదు అవార్డులు సాధించింది. ఆ సంవత్సరంలో శతాధిక సామెతలు, శతాధిక హిందీ పదానువాదం, వందకు పైగా హిందీ వాక్యాలకు తెలుగు అనువాదం, స్పెల్లింగ్‌ రెసిటేషన్‌లో పురస్కారాలను దక్కించుకుంది. ఆరేళ్ల 9 నెలల వయసులో అంటే 2021లో అయిదు అవార్డులను గెలుపొందింది.

రికార్డుల మీద రికార్డులు..
ఇంగ్లిష్‌ టు తెలుగు సెంటెన్స్‌ ట్రాన్స్‌లేషన్‌, శతాధిక పద గణ విభజన, దేశభక్తుల ఛాయాచిత్రాలు గుర్తించడం, శతాధిక తెలుగు క్రియలకు ఆంగ్ల క్రియా రూపాలధారణ, శతాధిక హిందీ పదాలకు గణ విభజన, హిందీ పొడుపులకు విడుపుల ధారణ, హిందీ ఉల్లేఖాలను తెలుగు అనువాదంతో చెప్పడం, శతాధిక వ్యతిరేక పదాలు చెప్పడం, శతాధిక ఆంగ్ల సంక్షిప్తాల వివరణ, వందకు పైగా ప్రకృతి- వికృతులు చెప్పడం ద్వారా రికార్డులు నెలకొల్పింది. ఏడేళ్ల 11 నెలల వయసులో అంటే 2022లో ఆరు ప్రదర్శనలు ఇచ్చి పలు పురస్కారాలను అందుకుంది. ఎనిమిదేళ్ల 4 నెలల వయసులో ఆంగ్ల పొడుపు కథలు, తెలుగు జాతీయాలు- సందర్భాలు, ఆంగ్లంలో కాలాలు- వాటి క్రియారూపాల ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా రికార్డులు నెలకొల్పింది.

గిన్నిస్‌ రికార్డు సాధనే లక్ష్యంగా...
‘భవిష్యత్తులో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సాధించాలనేది నా లక్ష్యం. అదేవిధంగా ఐఏఎస్‌ అధికారిణి కావాలనేది ఆశయం. నేను ఇంతటి విజయాలు సాధించడం వెనుక అమ్మానాన్నలు అందిస్తున్న తోడ్పాటు ఎంతో ఉంది. చిన్నప్పటి నుంచి నాకు పలు అంశాలపై శిక్షణ ఇస్తున్న మా నాన్న ఆశయాన్ని తప్పకుండా నెరవేరుస్తా’ అని ధీమాగా చెబుతోంది. మరి మనమంతా ఈ చిన్నారికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా!

- జానకి సుబ్బారావు, న్యూస్‌టుడే, ఏలూరు అర్బన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని