పిట్టకొంచెం.. రికార్డులు ఘనం!

హలో ఫ్రెండ్స్‌.. ‘ఏడాది వయసు పిల్లలు ఏం చేస్తారు?’ - పారాడుతూనే ఇల్లంతా తిరుగుతుంటారు. కనిపించిన వస్తువులను కిందపడేస్తూ.. చిందరవందర చేస్తుంటారు. రకరకాల శబ్దాలు,

Published : 30 Aug 2022 00:09 IST

హలో ఫ్రెండ్స్‌.. ‘ఏడాది వయసు పిల్లలు ఏం చేస్తారు?’ - పారాడుతూనే ఇల్లంతా తిరుగుతుంటారు. కనిపించిన వస్తువులను కిందపడేస్తూ.. చిందరవందర చేస్తుంటారు. రకరకాల శబ్దాలు, హావభావాలతో సందడి చేస్తుంటారు. ఓ నేస్తం కూడా అంతే.. కాకపోతే వాటన్నింటితోపాటు ఓ గొప్ప పనీ చేసింది. ఆ పనికి గుర్తింపుగా ఒకటీ రెండూ కాదు ఏకంగా నాలుగు రికార్డులు సాధించింది. ఆ వివరాలే ఇవీ..

ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న కియారా వయసు 15 నెలలు. అయితే, ఈ నేస్తం వాళ్ల అమ్మానాన్నలు విద్య, ప్రవీణ్‌ల సొంతూరు మాత్రం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు. ఉద్యోగరీత్యా కొన్నేళ్ల క్రితమే వారు అమెరికాకు వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. విషయం ఏంటంటే.. కియారా, తన జుట్టును క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లల కోసం విరాళంగా ఇచ్చేసింది. అంతేకాదు.. జుట్టును దానం చేసిన అతి పిన్న వయస్కురాలిగానూ రికార్డు సృష్టించింది.

తల్లి ఆలోచనే..

కియారా వాళ్ల అమ్మకు సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన ఎక్కువగా ఉండేది. ఎప్పటినుంచో క్యాన్సర్‌ బాధితుల కోసం తన జుట్టు ఇవ్వాలని అనుకుంటుందట. కానీ, అది కుదరలేదు. కొన్ని రోజులకు ఆమెకు కియారా పుట్టింది. పాపకు ఒత్తైన జుట్టు ఉండటంతో, దానిలో కొంత క్యాన్సర్‌ బాధితులకు అందించాలని అనుకుంది. అమెరికాతోపాటు మరికొన్ని దేశాల్లో క్యాన్సర్‌ సోకిన పిల్లలకు విగ్గులు, ఇతర సహకారాలు అందిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థను సంప్రదించిందామె. ఆ సంస్థ ప్రతినిధులు అందుకు కావాల్సిన ఏర్పాట్లతోపాటు సంబంధిత ధ్రువపత్రాలనూ సిద్ధం చేశారు. వాటన్నింటినీ ఆమె తన భర్తకు చూపించడంతో ఆయన ఆశ్చర్యపోయారట.

పది అంగుళాల జుట్టు..

గత ఫిబ్రవరిలో కియారా జుట్టును పది అంగుళాల మేర కత్తిరించిన తల్లిదండ్రులు.. దాన్ని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు అందించారు. ఇలా సేకరించిన జుట్టును క్యాన్సర్‌ బాధిత చిన్నారుల కోసం విగ్గులు తయారు చేసేందుకు ఉపయోగిస్తారట. ఇటువంటి కార్యక్రమాలతో పిల్లలకు చిన్నతనం నుంచే సామాజిక బాధ్యత తెలుస్తుందని, దాంతోపాటు వారికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని పాప తల్లి చెబుతోంది. జుట్టు దానం చేసిన అత్యంత చిన్న వయస్కురాలిగా నాలుగు రికార్డులు సైతం సాధించిందీ చిన్నారి. కలాం బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కియారా పేరు నమోదైంది. నిజంగా ఈ నేస్తంతోపాటు చిన్నారి తల్లిదండ్రులూ చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని