Published : 03 Sep 2022 00:18 IST

పదమూడేళ్లకే స్టార్టప్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనలో చాలామంది హోంవర్క్‌ చేయాలంటేనే బద్ధకిస్తారు. పరీక్షలంటే చాలు.. ఎక్కడలేని భయమంతా మనలోనే ప్రత్యక్షమవుతుంది. అలాంటిది, ఓ నేస్తం మాత్రం బడికెళ్లే వయసులోనే కోడింగ్‌ నేర్చేసుకున్నాడు. ఓ స్టార్టప్‌ కూడా పెట్టేశాడు. ‘అంతా గందరగోళంగా ఉందా? - అయితే, చిన్న వయసులోనే పెద్ద ఘనత సాధించిన ఈ బాలుడి వివరాలేంటో తెలుసుకుందాం మరి..

కేరళ రాష్ట్రంలోని కోచికి చెందిన ఉదయశంకర్‌కు 13 సంవత్సరాలు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ నేస్తం.. ఓ స్టార్టప్‌కు ‘చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ)’ కూడా. ఈ సంస్థ ద్వారా చిన్నారులకు వివిధ అంశాలపై తరగతులు చెప్పడం, ఆడుకోవడంతోపాటు గేమ్స్‌ ఎలా రూపొందించాలో కూడా నేర్పిస్తున్నాడు.

రోబోటిక్సా.. ఆటలా..  
చిన్నతనం నుంచే ఉదయశంకర్‌కు టెక్నాలజీ అంటే చాలా ఆసక్తి. గేమ్స్‌, ఇతర పరికరాల తయారీకి సంబంధించిన వీడియోలను ఎక్కువగా చూస్తుండేవాడు. అలా ఈ నేస్తానికి ఏడేళ్ల వయసున్నప్పుడు వేసవికాలం సెలవులను వృథా చేయకుండా.. ఆటలో, రోబోటిక్సో ఏదో ఒకటి నేర్చుకొమ్మని వాళ్ల అమ్మ చెప్పింది. దాంతో రోబోటిక్స్‌ నేర్చుకుంటానని సమాధానమిచ్చాడు. అలా ఆ సెలవుల్లో వివిధ అంశాలపై శిక్షణ తీసుకున్నాడు. చేసే పని ఏదైనా వ్యక్తిగతంగానో, కుటుంబం కోసమో కాకుండా.. సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని తల్లిదండ్రులు అతడికి సూచించారు.

తండ్రి సాయంతో..
సాంకేతికతపైన కాస్త పట్టు సాధించాక.. తండ్రి సహాయంతో ఇటీవల ఓ స్టార్టప్‌ను ప్రారంభించాడు ఉదయశంకర్‌. దాని ద్వారా ఎడ్యుకేషనల్‌ కిట్లను తయారు చేయసాగాడు. ఈ సంస్థకు సీటీఓగానూ బాధ్యతలు చేపట్టాడు. పిల్లలకు సైన్స్‌, గణితం, టెక్నాలజీ, కళలు లాంటి నైపుణ్యాలను తరగతి గదిలో టీచర్లు చెప్పేలా కాకుండా ఆడుతూపాడుతూ, ఆసక్తి రేకెత్తించేలా బోధించడం ఈ స్టార్టప్‌ ప్రత్యేకత. ఇప్పటికే ఇన్‌ఫ్రారెడ్‌ సాయంతో పనిచేసే టెంపరేచర్‌ గన్‌తోపాటు పోర్టబుల్‌ శానిటైజర్‌ డిస్పెన్సర్‌నూ ఉత్పత్తి చేశాడు.

చదువు మాత్రమే కాకుండా..
ఈ స్టార్టప్‌తో చిన్నారులకు కేవలం చదువు చెప్పడం మాత్రమే కాకుండా.. ఆటలూ అందించాలని అనుకున్నాడీ బాలుడు. వెంటనే సి, సి++ తదితర ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ నేర్చుకున్నాడు. సొంతంగానే గేమ్స్‌ రూపొందించడం ప్రారంభించాడు. ఈ నేస్తానికి ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ఉందండోయ్‌.. కొత్త సాంకేతికతలు, పరిశోధనలు, ప్రయోగాల్లాంటి వీడియోలను ఇందులో పోస్టు చేస్తుంటాడు. అంతేకాదు.. సాఫ్ట్‌వేర్‌ లాంగ్వేజీ పైథాన్‌లో సర్టిఫికేషన్‌ చేసిన అతికొద్ది మందిలో ఇతడూ ఒకడు కావడం గమనార్హం. 3డీ గ్లాసెస్‌ సహాయంతో గేమ్స్‌ ఎలా రూపొందించాలనే అంశంపైనా క్లాసులు చెబుతున్నాడు. చిన్న వయసులోనే ఇంత సాధించిన ఈ నేస్తం చాలా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని